NTV Telugu Site icon

Minister Buggana Rajendranath Reddy: 5న ‘రాయలసీమ గర్జన’.. సభకు రాకుంటే వాళ్లు సీమ ద్రోహులే..!

Minister Buggana Rajendrana

Minister Buggana Rajendrana

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈ ఉద్యమంలో ఆయా ప్రాంతాల ప్రజలను భాగస్వామ్యం చేసేపనిలో పడిపోయింది అధికార పార్టీ.. ఇప్పటికే విశాఖ వేదికగా ఉత్రరాంధ్ర ప్రజలతో జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనను విజయవంతం చేశారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇప్పుడు రాయలసీమ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 5న కర్నూలులో రాయలసీమ గర్జన భారీ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. జేఏసీ , వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విధ్యార్థి యువజన సంఘాలు ఈ గర్జనలో పాల్గొంటాయని వెల్లడించారు. రాయలసీమ బాగా వెనుకబడింది, రాయలసీమకు భౌగోళికంగా వాతావరణం అనుకూలంగా లేదు.. వర్షాలు ఎపుడోస్థాయో గ్యారంటీ లేదు.. 1937లో శ్రీబాగ్ పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగింది.. వెనుకబడిన రాయలసీమ ఉమ్మడి ఏపీ ఉంటే రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఒప్పందం పేర్కొందని గుర్తుచేశారు.. కృష్ణ జలాలను 10 ఏళ్ళు వాడుకోవాలని, అవసరమైతే పొడిగించాలని ఒప్పందం జరిగిందని.. 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా జరిగిందన్నారు మంత్రి బుగ్గన.

Read Also: Mahesh Babu : బ్యాక్ టు వర్క్ అంటున్న మహేష్

సంపూర్ణ ఏపీ ఏర్పాటయ్యాక కర్నూలు రాజధాని తరలించినా రాయలసీమ వాసులు పెద్ద మనసుతో ఒప్పుకున్నారని గుర్తుచేశారు మంత్రి బుగ్గన.. 2014లో రాష్ట్ర విభజనతో రాయలసీమ వందేళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నవ్యఆంధ్ర సీఎం అయ్యాక ఒకే చోట రాజధాని, హైకోర్టు, హెల్త్ సిటీ, టూరిజం సిటీ ఏర్పాటు చేశారు.. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక అధ్యయనం చేసి, సంప్రదింపులు జరిపి అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.. పాలన రాజధాని విశాఖలో, అమరావతిలో అసెంబ్లీ, న్యాయరాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.. సీఎం జగన్‌ గర్వంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని ప్రకటించారంటూ కొనియాడరు.

ఇక, రాయలసీమ గర్జనతో ఒక మెస్సేజ్ పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. సుప్రీం కోర్టు కూడా రాజధాని నిర్ణయం ప్రభుత్వానిదని చెప్పిందని గుర్తుచేశారు. శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం చేసి కేంద్రీకరణ మంచిది కాదని తేల్చిందని.. శివరామకృష్ణన్ కమిటీ కూడా వికేంద్రీకరణ చేయాలని సూచించిందని పేర్కొన్నారు.. జేఏసీకి వైసీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. రాయలసీమ చరిత్ర, పెద్ద నాయకులు కూడా జేఏసీ సభను విమర్శించడం దారుణమని మండిపడ్డారు.. నాయకులు చిన్న తరహా ఆలోచన చేయవద్దు.. మీరూ కలసి రండి, సభకు రాకుంటే వాళ్ళు రాయలసీమ ద్రోహులు అని హెచ్చరించారు.. హైకోర్టు రాయలసీమ హక్కు.. కరువు నివారణకు వైసీపీ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుందన్నారు.. ఇక, హైకోర్టు ఏర్పాటును ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసని మండిపడ్డారు. కరోన సమయంలో కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. మరి హైద్రాబాద్ -బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ టీడీపీ హయాంలో ఎందుకు తీసుకు రాలేదు..? అంటూ నిలదీశారు.