సముద్రంలో చేపలు, రొయ్యలు, నత్తలు, తాబేళ్లు వంటి అనేక రకాల జీవులు నివసిస్తుంటాయి. అయితే ప్రతి చేపకు ప్రత్యేకమైన స్వభావం, జీవన విధానం ఉంటుంది. కొన్నిసార్లు ప్రకృతి విపత్తులు లేదా సముద్రంలో ఏర్పడే భారీ అలల కారణంగా కొన్ని అరుదైన చేపలు ఒడ్డుకు కొట్టుకువస్తుంటాయి. అలా ఒడ్డుకు చేరిన వింత జీవులను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతుంటారు.
ఇటీవల విశాఖపట్నం ఋషికొండ సముద్రతీరంలో అరుదైన కలిమొయి చేప (స్పాటెడ్ మోరే ఈల్) మృతిచెంది ఒడ్డుకు కొట్టుకువచ్చింది. చిరుతపులి చారల మాదిరిగా ఆకర్షణీయమైన నమూనాలతో కనిపించే ఈ చేప సాధారణంగా లోతైన సముద్ర ప్రాంతాల్లో నివసిస్తుంది. పదునైన దంతాలు కలిగిన ఈ చేప సుమారు 5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని మత్స్య పరిశోధన శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ చేప ప్రధానంగా రాత్రి సమయంలో మాత్రమే వేటాడుతుందని, పగటి వేళ రాళ్ల మధ్య లేదా సముద్ర గర్భంలో దాక్కుని ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి వింతైన, అరుదైన చేప విశాఖ తీరంలో కనిపించడం స్థానికుల్లో విస్తృత ఆసక్తి, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ చేపలు సాధారణంగా మత్స్యకారుల వలలకు చిక్కవని అధికారులు స్పష్టం చేశారు.
