అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం స్కూల్లోకి చొరబడిన హేమంత్ అనే యువకుడు చెట్లు నరికే రంపం యంత్రంతో సదరు బాలికపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని అక్కడికక్కడే కుప్పకూలడంతో నిందితుడు ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. దాడి జరిగినప్పటి నుంచి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
అడవుల్లో పోలీసుల కాల్పులు.. గాయపడ్డ నిందితుడు?
పోలీసుల గాలింపు క్రమంలో నిందితుడు ఆత్మకూరు అడవుల ప్రాంతంలో దాక్కున్నట్లు పక్కా సమాచారం అందడంతో ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పోలీసులకు నిందితుడు ఎదురుపడ్డాడు. ఈ సమయంలో పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు హేమంత్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది. ఈ కాల్పుల్లో నిందితుడికి తీవ్ర గాయాలవ్వడంతో పోలీసులు అతడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

