NTV Telugu Site icon

Rains-Memes: గ్యాప్‌ ఇవ్వరా.. కొంచెం. వరుణుడిపై నెటిజన్ల ఫ్రస్టేషన్‌.

Rains Memes

Rains Memes

వారం రోజులుగా వర్షాలు విడవకుండా కురుస్తున్నాయి. మరో రెండు మూడు వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. విద్యార్థులు, వీధివ్యాపారులు సహా చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. బయటికి వద్దామంటే భయపడుతున్నారు. ‘ఇదెక్కడి వానరా బాబూ’ అనుకుంటూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కొంత మంది తమ ఫ్రస్టేషన్‌ని ఎలా తగ్గించుకోవాలో తెలియక వాన దేవుడిపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. తెలుగు సినిమాల్లోని కామెడీ క్లిప్పింగ్‌లతో కూడిన మీమ్స్‌ని పోస్ట్‌ చేస్తున్నారు.

వర్షం వల్ల అసౌకర్యంగా ఫీలవుతున్నవాళ్లు ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కాస్త రిలీఫ్‌ పొందుతున్నారు. ‘7/జీ బృందావన్‌ కాలనీ’ సినిమాలో కమెడియన్‌ సుమన్‌ శెట్టి మేడ పైన నిద్రపోతున్నప్పుడు హీరో, హీరోయిన్‌, చివరికి వాన కూడా డిస్టర్బ్‌ చేయటంతో నెత్తి మీద బాదుకుంటూ బోరున విలపిస్తాడు. ఈ సీన్‌ని రుద్ర అనే నెటిజన్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశాడు. రామానుజం అనే మరో వ్యక్తి ‘ఇదేం వర్షంరా నాయనా?. ఇట్లా తగిలింది’ అని తిట్టుకున్నాడు. ‘అదుర్స్’ మూవీలో కమెడియన్‌ బ్రహ్మానందం హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో ‘గ్యాప్‌ ఇవ్వరా.. కొంచెం’ అనే డైలాగ్‌ ఉన్న వీడియోని అప్‌లోడ్‌ చేశాడు.

మరికొంతమంది.. వాతావరణ శాఖ అధికారుల అవతారమెత్తి సరదాగా వర్ష సూచన చేస్తున్నారు. ‘హైదరాబాద్‌లో ఇవాళ వానొస్తుందని చెప్పిన రోజు వాన రాదు. పొడి వాతావరణం ఉంటుంది. వర్షం పడే అవకాశమే లేదన్న రోజు ఖచ్చితంగా వర్షం కురిసి తీరుతుంది’ అని ఇంకో యూజర్‌ సెటైర్‌ వేశాడు. రీసెంట్‌ హిట్‌ మూవీ ‘డీజే టిల్లు’లో యాక్టర్‌ సిద్ధూ జొన్నలగడ్డ చెప్పిన డైలాగ్‌ ‘అట్లుంటది మనతోని’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పంట నష్టం జరిగింది.

ఈ మేరకు ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ఆశిస్తున్నారు. కానీ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక తయారుచేసే పరిస్థితి. వర్షాల నేపథ్యంలో రాజకీయ నాయకులూ రంగ ప్రవేశం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా పంట నష్ట పరిహారాన్ని ఇవ్వట్లేదని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ విమర్శించారు. పంట బీమా లేకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని సాయిరెడ్డ అనే రైతు వాపోయాడు. జూలై నెలలో ఈ స్థాయిలో వాన పడటం తానెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.