విజయవాడ నగరంలో ఇటీవల 9వ తరగతి చదువుతున్న బాలిక అపార్టుమెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే టీడీపీ నేత వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ బాలిక సూసైడ్ నోట్ రాయడం సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఉండే అపార్ట్‌మెంట్‌లోనే నివాసం ఉంటున్న టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడి ఇంటిని కూడా సీజ్ చేశారు.
Read Also: మొక్కే కదా అని పీకాడు.. ప్రాణాలు కోల్పోయాడు
నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు. కాగా ఆత్మహత్యకు ముందు టెర్రస్‌పై 20 నిమిషాల పాటు బాలిక అటూ ఇటూ తిరుగుతూ సీసీ టీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు వారు సీసీ టీవీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
