NTV Telugu Site icon

Perni Nani : సినీ పరిశ్రమకు అసలు చంద్రబాబు ఏం చేశారు?

Perni Nani

2002, 2003 నుండి మోహన్ బాబుతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. కాఫీ కోసం పిలిస్తే వారి ఇంటికి వెళ్లానని, మాటల సందర్భంగా సినిమా వ్యవహారాలు చర్చకు వచ్చాయని, కానీ కొందరు దీనిపై కూడా దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న మోహన్ బాబు రానందుకు వివరణ ఇవ్వటానికి వెళ్లానని అంటున్నారని, అదేమీ కాదు, అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, టిక్కెట్ల వ్యవహారం మీద సమస్య సృష్టించిందే చంద్రబాబుని ఆయన విమర్శించారు.

దాన్ని పరిష్కరించింది జగన్‌ అని ఆయన తెలిపారు. బ్లాక్ టిక్కెట్లతో ప్రజల్ని దోచుకునే సంప్రదాయానికి తెరతీసిందే చంద్రబాబు అని, సినీ పరిశ్రమకు అసలు చంద్రబాబు ఏం చేశారు? అని ఆయన ప్రశ్నించారు. వారిని రాజకీయాలకు వాడుకోవటం తప్ప ఏమీ చేయలేదని, నిన్న చర్చలకు వచ్చిన సినిమా వాళ్లకు మా పార్టీతో ఏమైనా సంబంధం ఉందా?అని ఆయన అన్నారు. ఇక్కడకి వచ్చిన వారెవరికీ మా పార్టీలో సభ్యత్వం లేదని, సినిమా వాళ్ల సమస్యలు పరిష్కరించటమే మా ఉద్దేశమని, ప్రభుత్వ సహకారానికి సినిమావాళ్లంతా సంతోషించారన్నారు.