NTV Telugu Site icon

Pawan Kalyan Tour: పవన్ కళ్యాణ్ పర్యటనకు అడగడుగునా ఆటంకాలు

Pawan Kalyan

Pawan Kalyan

అనుకున్నట్టుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతకు దారితీస్తోంది. అనుమతి తీసుకున్నా తగిన బందోబస్తు ఇవ్వలేదు పోలీసులు. పర్యటన సందర్భంగా పవర్ కట్ మామూలైపోయింది. వీధి దీపాలు సైతం తీసేసిన వైనం అందరిని విస్మయానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్ ర్యాలీని మధ్యలో నిలిపేసిన పోలీసులు.. జనసేన కార్యకర్తలపై తమ ప్రతాపం చూపించారు. ఆంక్షలు దాటుకొని నగర వీధుల్ని ముంచెత్తింది జన ఉప్పెన. కనుచూపు మేర జనప్రవాహంతో రహదారులు జనసంద్రంగా మారిపోయాయి.

ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు విని వారికి అండగా నిలిచే ఉద్దేశంతో ఆదివారం జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొనడానికి, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకుల సమావేశాల నిమిత్తం శనివారం సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి పార్టీ శ్రేణులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. విమానాశ్రయానికి వేలాదిగా తరలి వచ్చిన జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ రాక నేపధ్యంలో మధ్నాహ్నం నుంచి విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్ర సంప్రదాయ కళలు అయిన తప్పెటగుళ్లు, గిరిజన నృత్యం ధింసా, కోలాటాలు, విచిత్ర వేషగాళ్లు, డప్పుల కళాకారులు పవన్ కళ్యాణ్ తమదైన శైలిలో ఆహ్వానం పలికారు. అనంతరం వేలాది మంది భారీ ర్యాలీగా కదలిరాగా బస చేయనున్న నోవాటెల్ హోటల్ కి బయలుదేరారు. విమానాశ్రయంలో పోలీసులు తగు భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టకుపోవడంతో ప్రాంగణం నుంచి బయటకు రావడానికి సుమారు 40 నిమిషాల సమయం పట్టింది.

విమానాశ్రయంలో ఓ అభిమాని తన మొబైల్ పవన్ కళ్యాణ్ కి అందచేసి తనతో పాటు సాటి జనసైనికులతో సెల్ఫీ దిగాలని కోరారు. అతని కోరిక మేరకు పవన్ అతని మొబైల్ లో స్వయంగా సెల్ఫీ దిగారు. ఆ తర్వాత చాలా మంది సెల్ఫీల కోసం తమ మొబైల్స్ పవన్ కి ఇచ్చేందుకు ఎగబడ్డారు. అందరితో సెల్ఫీలు దిగారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రధాన రహదారి మీదకు చేరుకునే సమయానికి వెలుతురు మందగించింది. అయితే అప్పటికే బయట మరో జనప్రవాహం ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. పోలీసులు వారిని రహదారికి ఒక వైపు మళ్లించడం గాని, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు గాని చేపట్టకపోవడంతో ఒక్కో అడుగు కదలడం కష్టంగా మారింది.

Read Also: Pawan Kalyan: మంత్రులపై దాడి కేసు.. జనసేన కార్యకర్తల అరెస్ట్

ఎన్ఏడీ, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్.. ఇలా ప్రతి కూడలిలో వేల సంఖ్యలో ప్రజలు, జనసైనికులు, మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉండడంతో.. ఒక దశలో వాహన శ్రేణి ముందుకు కదలడం కష్టంగా మారింది. ఎన్ఏడీ ఫ్లై ఓవర్ నుంచి వెనక్కి చూస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహనం నుంచి ఎయిర్ పోర్టు వరకు రహదారి మొత్తం ఆయన కోసం వచ్చిన జనప్రవాహంతో నిండి, జనసేన జెండాలు రెపరెపలాడుతూ కనబడ్డాయి. ప్రతి అడుగులో పెద్ద పెట్టున నినాదాలు చేశారు జనసైనికులు. మహిళలు హారతులు పట్టేందుకు పోటీ పడ్డారు. విమానాశ్రయం నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వరకు ర్యాలీ చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పట్టింది.

పవన్ కళ్యాణ్ పర్యటన.. భారీ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం పవర్ కట్ చేసింది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయానికే వెలుతురు లేదు. మీడియా కవరేజ్ రాకుండా విశాఖలో విద్యుత్ కోతతో పాటు నిత్యం దేదీప్యమానంగా వెలిగే వీధి దీపాలను సైతం వెలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వ తీరుపై జనసైనికులు, స్థానికులు మండిపడ్డారు. కొంత సమయం చీకట్లోనే పవన్ కళ్యాణ్ ర్యాలీ సాగింది. ఆ తర్వాత మీడియా వాహనంలో జనరేటర్ సాయంతో ఎల్ఈడీ లైట్ల వెలుతురు ర్యాలీకి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రభుత్వం పోలీస్ పవర్ ఉపయోగించడం మొదలు పెట్టింది.

లైటింగ్ తో ఉన్న మీడియా వాహనాన్ని దూరంగా జరిపేశారు. సీఐ స్థాయి అధికారి మీడియా వాహనంలో డ్రైవర్ దగ్గర కూర్చుని పవన్ కళ్యాణ్ ప్రజలకు కనబడకుండా జాగ్రత్త పడడం వంటి చర్యలు తీసుకున్నారు. పోలీసుల తీరు పట్ల జనసేన నేతలు ఒక దశలో నిరసన వ్యక్తం చేశారు. డీసీపీ సుమిత్ సునీల్ గరుడ, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేయకుండా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరు పట్ల విశాఖ ప్రజలు, జనసేన శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ రాకకోసం గంటల తరబడి వేచి చూస్తుంటే పోలీసులు అలా తీసుకువెళ్లిపోవడాన్ని తప్పుబట్టారు. నోవాటెల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన తెలిపే ప్రయత్నం చేసిన జనసైనికుల మీద లాఠీలు కూడా ఝుళిపించారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా శనివారం పోలీసుల ఓవరాక్షన్ సర్వత్రా చర్చనీయాంశమైందని జనసేన మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.