కర్నూలు జిల్లా సిరివెళ్లలో కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు విషయాలపై కులంకషంగా మాట్లాడారు. తాను కుల, మతాలకు అతీతంగా ఉంటానని.. ముస్లింలకు అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఇస్లాం టోపీలు పెట్టుకుని రాజకీయాలు చేసేవాడిని కాదని.. వైసీపీ వాళ్ల తరహాలో అలయ్ బలయ్ చేయలేనని ఎద్దేవా చేశారు. ముస్లింలు పనిచేసుకోవాలంటే ఇప్పుడు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏ కులంలో పుట్టాలో మన చేతుల్లో లేదని.. మానవత్వం చూపే విషయం మాత్రం మన చేతుల్లోనే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీఎం స్థానం ఇస్తారా లేదా అన్నది ప్రజల చేతుల్లోనే ఉందని పవన్ వ్యాఖ్యానించారు.
తాను అన్ని కులాల వారికి అండగా ఉంటానని.. ప్రజల అభివృద్ధిని కోరుకునే మనిషినని పవన్ తెలిపారు. రైతు కన్నీరు పెట్టుకోకూడదని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా 70 ఏళ్లుగా సిదేశ్వరం ప్రాజెక్టు నిర్మించలేకపోయారని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే సిదేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తీరతామన్నారు. జనసేన నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందన్నారు. అవకాశం ఇస్తే ఐదేళ్లలో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. యువతలో చైతన్యం, మార్పు రాకుంటే సమాజంలో మార్పు రాదన్నారు.
ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చని.. కానీ వైసీపీ నేతలు రోజూ తనను తిడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీ తరహాలో డబ్బులతో ఓట్లు కొననని తెలిపారు. వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని.. మద్యపానం నుంచి వాళ్లకు వేల కోట్లు వస్తున్నాయని.. అందుకే ఓటుకు 2 వేలు, 3 వేలు అంటూ ఇస్తారని పవన్ ఆరోపించారు. కానీ తన దగ్గర డబ్బులు లేవన్నారు ప్రజలు ఎందుకు తమకు ఓటు వేయాలన్న విషయాన్ని మాత్రమే తాము చెప్పగలమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ మరోసారి స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోతోందని.. ఆ అప్పులు ఎటువైపు వెళ్తున్నాయో తెలియడంలేదన్నారు. ఈ డబ్బులన్నీ ఓటు బ్యాంకుకు వెళ్తున్నాయన్నారు. రైతు స్థిరీకరణ నిధి ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారా అని ప్రశ్నించారు. సమాజానికి ఉపయోగపడే పథకాలకు తాను వ్యతిరేకం కాదని.. వీటితో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమేనన్నారు.
వైసీపీ వాళ్లు సింహం లాగా సింగిల్‌గా వస్తామంటున్నారని.. వాళ్లవి కేవలం సినిమా డైలాగులేనని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పౌరుషం ఉండదని.. కేవలం వ్యూహాలు మాత్రమే ఉంటాయన్నారు. తనను సింగిల్‌గా రావాలని చెప్పడానికి వైసీపీ వాళ్లు ఎవరని పవన్ ప్రశ్నించారు.వైసీపీ వాళ్లకు అతి ఎక్కువైందని.. అది కాస్త తగ్గాలన్నారు. వైసీపీ నేతలు తనపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని.. తాను కూడా వాళ్ళ చిట్టా విప్పగలనని పవన్ అన్నారు. తిట్ల వల్ల ప్రజలకు ఉపయోగం లేదని.. అందుకే తాను వ్యక్తిగతంగా తిట్టనని క్లారిటీ ఇచ్చారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. బీజేపీ వాళ్లకు చాలా సార్లు తాను విభజన తీరుపై చెప్పానని.. ఇంకా రాష్ట్రానికి విభజన దెబ్బలు తగులుతున్నాయన్నారు. తనకు అధికార కాంక్ష లేదని.. అయితే ప్రజలు అధికారం ఇచ్చినా అది బాధ్యతగా భావిస్తానన్నారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.
Pawan Kalyan: పవన్ చేతికి కొత్తగా రెండు ఉంగరాలు.. జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారా?