One Student Dead Body Found At Pudimadaka Beach: అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే! బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై గ్రామ మత్స్యకారులు మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి విషాదం ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతంలో, ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం కొంతమంది బీచ్‌కి వచ్చారని.. సాయంత్రం 4:00 గంటల సమయంలో సముద్రానికి ఆనుకుని ఉన్న రాళ్లపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు వెనుక నుంచి ఓ కెరటం వారిని కొట్టిందని పేర్కొన్నారు. అప్పుడు ఏడుగురు విద్యార్థులు చెల్లా చెదురుగా గల్లంతయ్యారన్నారు. వారిలో ఒకరిని సురక్షితంగా రక్షించామని, ఇంకొక విద్యార్థి అప్పటికే నీరు ఎక్కువగా తాగి చనిపోయాడన్నారు. నిత్యం వందలాది మంది ఈ బీచ్‌కు వస్తుంటారని, గతంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు రక్షించేవారన్నారు. ఒకవేళ నిన్న విద్యార్థులు గల్లంతైన సమయంలో మా మత్స్య కారులు ఉండుంటే.. కచ్ఛితంగా మిగతా వారిని కూడా రక్షించేవారని చెప్పారు.
కాగా.. గల్లంతైన ఐదుగురు విద్యార్థుల కోసం చేపట్టిన సెర్చింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఒకరి మృతదేహం లభ్యమైంది. హెలికాప్టర్ సహాయంతో ఆ మృతదేహాన్ని గుర్తించారు. మిగతా నలుగురు విద్యార్థుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటు.. మృతి చెందిన విద్యార్థి పవన్‌గా తేలగా, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అతడ్ని అత్యవసర చికిత్స కోసం విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. తమ పిల్లల కోసం పూడిమడక బీచ్‌కి చేరుకుంటున్నారు.