Site icon NTV Telugu

Andhra Pradesh: ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధర భారీగా పెంపు

ఏపీలో ఆర్టీసీకి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. సాధారణంగా నిత్యం లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీకి చమురు కంపెనీలు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు డీజిల్‌ను సరఫరా చేస్తుంటాయి. అయితే 10 రోజులుగా బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ ధర రూ.4.30 వరకు అదనంగా వడ్డిస్తున్నాయి. దీంతో ఆర్టీసీపై రూ.10 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు బయట పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొట్టించాలంటూ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ వ్యాప్తంగా నిత్యం 10వేల బస్సులకు సుమారు 7.3 లక్షల లీటర్ల డీజిల్‌ను అధికారులు వాడుతుంటారు. దీంతో చమురు సంస్థలు ఆర్టీసీకి రాయితీని ఇస్తాయి. బయటి మార్కెట్‌తో పోలిస్తే లీటర్ డీజిల్ ధర రూ.2 తక్కువగా ఉంటుంది. అయితే కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచలేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధరను చమురు కంపెనీలు భారీగా పెంచేశాయి. దీంతో బయటి మార్కెట్ కంటే ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధరలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

Exit mobile version