సిఐపై అవినీతి ఆరోపణలు
తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక సిఐ గీతారామకృష్ణను వి.ఆర్.కు తరలించారు. సారా కేసులో డబ్బులు తీసుకున్నట్లు సిఐ గీతారామకృష్ణ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు డిఎస్పీ ఖాదర్ బాషా విచారణ చేపట్టారు. తాత్కాలికంగా ఎటపాక సిఐగా గజేంద్ర రానున్నారు.
50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు
తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుండి మరో 50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచారు. ప్రస్తుతం ఆయా రూట్లలో 270 బస్సులు నడుపుతుండగా వీటి సంఖ్యను 320కి పెంచారు. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సర్వీసులను, జిల్లా పరిధిలో రూట్లలోనూ బస్సులు తిరగనున్నాయి. కాగా కాకినాడ, రాజమండ్రి నుంచి ఎటపాక, సీలేరుకు సర్వీసులు పెంచారు. దూరప్రాంత సర్వీసులకు ఆన్‌లైన్ టిక్కెట్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
చిరుత సంచారం
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం-ఫోర్‌బై గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. చిరుత సంచారంతో మన్యం వాసుల్లో భయాందోళన నెలకొంది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు వాహనదారులకు చిరుతపులి కనిపించింది. రహదారిపై చిరుతను చూసి ఫోర్ బై గ్రామస్థులను యువకులు అప్రమత్తం చేశారు. లక్కవరం రేంజ్ డీఆర్వో జాన్సన్ సిబ్బందితో కలిసి వచ్చి పలిశీలిస్తున్నారు. చౌడు నేల వద్ద చిరుత ఆకారంలో ఉండే దుమ్ములగొండి పాదముద్రలను డీఆర్వో జాన్సన్ సిబ్బంది గుర్తించారు.
లక్ష డోసులు లక్ష్యం
నేడు తూర్పుగోదావరి జిల్లాలో మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా లక్ష మందికి మొదటి డోసు టీకాలు ఇవ్వనున్నారు. ఒక్కరోజే లక్ష మందికి టీకాలు వేయడం ద్వారా రికార్డు సాధించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 465 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అయిదేళ్లలోపు పిల్లల తల్లులకు, 45 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వనున్నారు. జిల్లాకు చేరిన 1.50 లక్షల డోసుల కొవిషీల్డ్, 8 వేల డోసులు కొవాగ్జిన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 84 రోజులు దాటిన తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు టీకా ఇవ్వనున్నారు.