చంద్రబాబు, లోకేష్‌కు చీర పంపిస్తామని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రోజా తనకు చీర పంపిస్తా అంటున్నారని.. ఒకవేళ ఆమె తనకు చీర పంపిస్తే తాను తీసుకుని గౌరవప్రదంగా తన తల్లికి ఇస్తానని లోకేష్ తెలిపారు. అయితే చీర కట్టుకునే మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి రోజా మహిళా సమాజానికి ఆమె క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మంత్రులు శాసనమండలిలో మాట్లాడరని, శాసనసభలో తన తల్లిని అవమానించినట్లు చెప్పారు. మహిళా మంత్రి హోదాలో ఉండి రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని విమర్శించారు.
అటు మంత్రి రోజా చీర వ్యాఖ్యలపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభం శుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నారని.. ఇంత జరుగుతున్నా తాడేపల్లి కొంప నుంచి బయటకు రాలేని నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు. మహిళా సాధికారత గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. లోకేష్ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటున్నారని గుర్తుచేశారు. రోజా గతంలో ఓడిపోలేదా అని ప్రశ్నించారు. తల్లిని విశాఖలో గెలిపించుకోలేని జగన్ ఏ రంగు చీర కట్టుకోవాలో రోజా చెప్పాలని సూటిగా నిలదీశారు. ఊరికో ఉన్మాది ఉన్నాడని తాము అంటుంటే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని… వైసీపీ నేతలకు ఎన్ని చీరలు కావాలో చెప్తే తాము పంపిస్తామని వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు.