NTV Telugu Site icon

Nara Lokesh: ఫెయిలైంది టెన్త్ స్టూడెంట్స్ కాదు.. సర్కారు..!!

Nara Lokesh

Nara Lokesh

ఏపీలో పదో తరగతి ఫలితాలలో కుట్ర జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్‌లో ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితో పాటు ఇంట‌ర్‌, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే కుట్రతోనే ఎక్కువ‌ మందిని ఫెయిల్ చేశార‌ని మండిపడ్డారు. అయితే ఇది టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదని.. స‌ర్కారు ఫెయిల్యూర్ అంటూ లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన టెన్త్ ప‌రీక్షల్లో పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, మాల్ ప్రాక్టీసుల‌ కారణంగా అభాసుపాలైందని ఎద్దేవా చేశారు. టెన్త్ రిజ‌ల్ట్స్‌ వాయిదా, దిగ‌జారిన ఫ‌లితాలన్నీ స‌ర్కారు కుతంత్రమే అని ఫైరయ్యారు.

టెన్త్ ఫలితాల్లో 71 స్కూళ్లలో జీరో పాస్‌ నమోదు కాగా 20 ఏళ్లలో అతి త‌క్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత న‌మోదైనట్లు లోకేష్ గుర్తుచేశారు. టెన్త్‌లో దారుణ ఫ‌లితాలు ప్రభుత్వం పాప‌మేనన్నారు. ప‌దో త‌ర‌గ‌తి క‌ష్టప‌డి చ‌దివి పాసై ఉంటే వైఎస్ జ‌గన్‌కు విద్యార్థుల క‌ష్టాలు తెలిసేవని లోకేష్ కౌంటర్లు వేశారు. పరీక్షల వేళ విపరీతమైన కరెంటు కోతలు, ప‌రీక్షా స‌మ‌యం కుదింపు, పేపర్ లీక్‌, మాల్ ప్రాక్టీస్‌, మాస్ కాపీయింగ్‌ల‌తో విద్యార్థులు మాన‌సికంగా బాగా దెబ్బతిన్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు-నేడు పేరుతో రూ. 3500 కోట్లను వైసీపీ నేతలు మింగేసి విద్యావ్యవ‌స్థను నిర్వీర్యం చేశారని నారా లోకేష్ ఆరోపించారు. టీచ‌ర్లకు వైన్‌షాపుల వ‌ద్ద డ్యూటీ వేయడంపై పెట్టిన శ్రద్ధ విద్యపై సీఎం జగన్ ఎప్పుడూ దృష్టి పెట్టలేదన్నారు. చ‌దువు చెప్పాల్సిన టీచర్లను నాడు-నేడు ప‌నుల‌కు కాప‌లా పెట్టారంటూ మండిపడ్డారు. మీడియంల పేరుతో విద్యార్థుల బంగారు భ‌విష్యత్తుతో ఆట‌లాడుకున్నారని విమర్శలు చేశారు. డీఎస్సీ వేయకపోవడంతో హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొర‌త నెలకొందన్నారు.