NIA: నంద్యాలలో ఎన్‌ఐఏ విచారణ.. కేరళ ఎన్‌కౌంటర్‌ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?

Nia

Nia

NIA: నంద్యాల జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారుల విచారణ కలకలం రేపుతోంది. గడివేముల మండలం పరమటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. జయమ్మ తల్లిదండ్రులు, బంధువులను విచారించడంతో పాటు గ్రామ వీఆర్వో నుంచి కూడా కీలక సమాచారం సేకరించారు. దాదాపు 25 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు ఉధృతంగా సాగిన సమయంలో, వివాహం అనంతరం నామాల జయమ్మ తన భర్త భాస్కర్‌తో కలిసి మావోయిస్టు ఉద్యమంలో చేరి అడవిబాట పట్టినట్లు సమాచారం. అనంతరం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భాస్కర్ పోలీసులకు లొంగిపోగా, జయమ్మ మాత్రం ఉద్యమాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.

2005లో నల్లమల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు బలహీనపడటంతో జయమ్మ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం కేరళ అడవుల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్‌లో జయమ్మ మృతిచెందినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఎన్‌ఐఏ అధికారులు నంద్యాల జిల్లాలో విచారణ చేపట్టి కుటుంబ సభ్యులు, స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించడంతో జయమ్మ మృతిపై మరోసారి చర్చ మొదలైంది. మృతి చెందినట్లు ప్రచారం జరిగిన తర్వాత కూడా ఎన్‌ఐఏ విచారణ కొనసాగుతుండటంతో, జయమ్మ నిజంగా మృతిచెందిందా? లేక ఇంకా జీవించి ఉందా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై ఎన్‌ఐఏ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.