NTV Telugu Site icon

రోజా అనుకున్నదొక్కటీ ..అయ్యిందొక్కటా?

ఎమ్మెల్యే రోజా అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటా? కంట్లో నలుసుగా మారిన పార్టీ నేతపై చర్య తీసుకోవాలని రోజా కోరితే.. అతడిని పిలిచి కీలకపదవి కట్టబెట్టారా? ఫైర్‌బ్రాండ్‌ మాట చెల్లుబాటు కాలేదా? నగరిలో హాట్‌ టాపిక్‌ మారిన అంశం ఏంటి?

రోజాకు సవాల్‌ విసిరిన వారికి అందలం..?
పాపం రోజా..! రాష్ట్రం అంతటికీ ఆమె ఫైర్ బ్రాండ్‌. ప్రత్యర్థులను తూటాల్లాంటి మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా.. ఫక్తు రాజకీయ నేతలా మారిపోయారు రోజా. ఆమె అంటే ప్రత్యర్థులకు హడల్‌. ఆమెను ఏమైనా అంటే.. తోకతొక్కిన త్రాచులా లేస్తారు. ఇదంతా ప్రత్యర్థుల విషయంలో మాత్రమే. కానీ.. పార్టీలో ఆమెకు ఫైర్‌ లేకుండా చేస్తున్నారు ప్రత్యర్థులు. రోజాకు సవాల్‌ విసిరిన వారికి అందలం దక్కుతోంది. దమ్ముంటే నామీద పోటీ చేసి గెలవమని రోజాకు సవాల్‌ విసిరిన ఓ మండలస్థాయి నేతకు ఏకంగా శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ పదవి కట్టబెట్టింది వైసీపీ హైకమాండ్‌.

రెండుసార్లు గెలిపించినవాళ్లే రోజాపై తిరుగుబాటు?
ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో విపక్షాల నుంచి సమస్యలు ఉన్నాయో లేదో కానీ స్వపక్ష నేతలు మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నారు. నగరిలో వైసీపీ మూడు, నాలుగు ముక్కలైంది. గత రెండు ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కృషి చేసినవారే.. ఇప్పుడు ఆమె వ్యవహార శైలి నచ్చక తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంతపార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. రెండోసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆమెకు నగరిలో అసమ్మతి బలపడుతూ వస్తోంది. ఎంతెలా అంటే నియోజకవర్గంలోని నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ దక్కింది.

తనపై పోటీ చేయాలని రోజాకు పార్టీ నేత చక్రపాణిరెడ్డి సవాల్‌
చక్రపాణిరెడ్డి తొలినుంచి రోజా ప్రత్యర్థివర్గమే. ఇప్పుడు ఎమ్మెల్యే రోజా ప్రమేయం లేకుండానే ఆయన ప్రతిష్టాత్మక శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌ పోస్ట్ దక్కించుకున్నారంటే.. పార్టీలో చక్రపాణిరెడ్డికి ఉన్న పట్టును అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి రోజా, చక్రపాణిరెడ్డిల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎంపీపీ ఎంపిక విషయంలో రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఎంపీడీవో ఆఫీస్‌ వద్ద ఆందోళన చేశారు. రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూడా. రెండుసార్లు ఆమెను గెలిపించినందుకు చెప్పు దెబ్బలు తిన్నట్టు అయిందని తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. దమ్ముంటే స్వతంత్ర అభ్యర్థిగా రోజా బరిలో దిగి తనపై పోటీ చేయాలని.. తాను ఓడిపోతే రోజా ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తానని సవాల్ విసిరారు చక్రపాణిరెడ్డి. ఎమ్మెల్యే సైతం ఆ అంశంపై స్పందించారు. పార్టీలో ఉంటూ విప్‌ను ఎలా ధిక్కరిస్తారని మండిపడ్డారు. హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించకపోతే సీఎం జగన్‌ను అవమానించినట్టేనన్నారు రోజా.

వ్యతిరేకవర్గానికి చెక్‌ పడుతుందని భావించిన రోజా టీమ్‌
నిండ్ర ఎంపీపీ వివాదం మొదలుకొని మొన్నటికి మొన్న సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీ వరకు పార్టీ నాయకులు రోజాకు వ్యతిరేకంగా సై అంటే సై అంటున్నారు. నగరి వైసీపీలో రగడపై పలుమార్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు రోజా. తిరుగుబాటు నాయకులను పార్టీ నుంచి తొలగించాలని ఆమె కోరారు. దాంతో వ్యతిరేకవర్గానికి చెక్ పడుతుందని భావించారట. వారికి ఎలాంటి పదవులు రావని అనుకున్నారట. కానీ.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఎమ్మెల్యే రోజాకు.. ఆమె వర్గానికి షాక్‌ ఇచ్చింది. వైసీపీ నుంచి పంపించేయాలని కోరితే.. ఏకంగా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌గా అవకాశం కల్పించడం మింగుడుపడటం లేదట. నగరిలో రోజా వ్యతిరేకవర్గానికి పదవులు రావడం వెనక జిల్లా మంత్రి హస్తం ఉందని అనుమానిస్తున్నారట. మొత్తానికి రోజా ఒకటి తలిస్తే పార్టీ మరొకటి చేసిందని అధికారపార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.