NTV Telugu Site icon

విత్తనాలు గ్రామాల్లోనే అందిస్తున్న ఘనత వైఎస్ జగన్ ది : కొడాలి నాని

ఇటీవల జగన్ సర్కార్ ప్రకటించిన నూతన జిల్లాల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నూతన జిల్లాల అంశంపై టీడీపీ అధినేత పలు విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నూతన జిల్లాల్లో ఓ జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ అభిమానిగా నేను ఎంతో సంతోషిస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా నా తరపున, ఎన్టీఆర్ ను దైవంగా భావించే వారి తరఫున జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన వైసీపీ పార్టీ ఎన్టీఆర్ ఆశయాలకు, ఎన్టీఆర్ కు వ్యతిరేకం కాదని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, ఇప్పుడు ఉన్న టీడీపీకి మాత్రమే వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసి ఇవాల్టికి రెండున్నర ఏళ్ళు అయ్యిందని, గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేశారన్నారు. రైతుల కోసం ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి రైతాంగానికి మేలు చేస్తున్న వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. విత్తనాలు గ్రామాల్లోనే అందిస్తున్న ఘనత వైఎస్ జగన్ ది అని, అధికారంలోకి వస్తే ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.