NTV Telugu Site icon

అమరావతి ఉద్యమంపై బొత్స హాట్ కామెంట్స్

న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతిలో రైతులు సాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాజ‌ధాని ఉద్యమం రైతుల‌ది కాదు. టీడీపీ కార్యకర్తలదే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చెర‌కు రైతుల‌కు బ‌కాయిలు పూర్తిగా చెల్లిస్తామని, ఎన్‌సిఎస్ సుగ‌ర్స్‌కు చెందిన 24 ఎక‌రాల‌ను వేలం వేసి ఆ సొమ్ముతో బ‌కాయిలు చెల్లించేందుకు చ‌ర్యలు తీసుకుంటామన్నారు.

ఎన్‌సిఎస్ సుగ‌ర్స్ పై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తాం. ఫ్యాక్టరీ భూములను విక్రయించి, రైతుల బ‌కాయిల‌ను వీలైనంత త్వర‌గా చెల్లిస్తాం. రూ.10కోట్లు విలువైన పంచ‌దార‌ను ఇప్పటికే ప్రభుత్వం సీజ్ చేసింది. మాది రైతు ప‌క్షపాత ప్రభుత్వం. రైతు సంక్షేమ‌మే మాకు ముఖ్యం.

ప్రతిప‌క్షాలు చేసే త‌ప్పుడు ప్రచారాన్ని న‌మ్మవ‌ద్దన్నారు. 2015 నుంచి పేరుకుపోయిన రూ.27.80 కోట్లను, ఫ్యాక్టరీ భూముల‌ను అమ్మి, త‌మ ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం రూ.16కోట్ల బ‌కాయి ఉంది. అణాపైసాతో స‌హా చెల్లించేందుకు త‌మ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందన్నారు.

తమ సమస్యలపై నిర‌స‌న తెలిపే హ‌క్కు, ధ‌ర్నా చేసే హ‌క్కు అంద‌రికీ ఉంటుంది. కానీ పోలీసుల‌పై రాళ్లేసే సంస్కృతి స‌రికాదు. ఆందోళ‌న‌ను ప్రక్కదారి ప‌ట్టించేందుకు, రైతుల ముసుగులో, ఒక పార్టీకి చెందిన‌వారు రాళ్లేసిన‌ట్లుగా స‌మాచారం ఉంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి బొత్స. రాజ‌కీయ ల‌బ్దికోసం రైతుల‌ను అడ్డుపెట్టుకోవ‌ద్దని, గంజాయి గురించి మాట్లాడే హ‌క్కు చంద్రబాబుకు లేదు. పోలీసు వ్యవ‌స్థపై నింద‌లు వేయ‌డం స‌రికాదని హితవు పలికారు.