గవర్నర్ ప్రసంగం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు కొనసాగుతున్నాయి. ఇటీవల సంభవించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సీఎం జగన్ స్వయంగా సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. గౌతమ్ రెడ్డి మరణంపై ఆయన ప్రసంగిస్తూ.. ఆ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.
సంతాప తీర్మానం సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. గౌతమ్ రెడ్డి మరణం చాలా లోటని ఆయన అన్నారు. ఆయన మరణంపై మాట్లాడాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదని.. తన పక్కన సీటులో కూర్చోవాల్సిన వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తనను గౌతమ్ రెడ్డి అన్ని విషయాల్లో ప్రోత్సహించే వారని తెలిపారు. తనకు అత్యంత సన్నిహితుడని.. సొంత అన్నలా ఉండేవారు అని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి మరణం తమ పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా తీరని నష్టమన్నారు.
