భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి అనుమానం ఒక ప్రాణాన్ని బలిగొన్న సంచలన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై పెంచుకున్న అనుమానంతో కన్న భర్తే ఆమె గొంతు నులిమి హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం హంతకుడు నేరుగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.
మొదలైన మనస్పర్థలు.. తెల్లవారుజామున ప్రాణం తీసిన ఆగ్రహం
పులిగడ్డకు చెందిన మండలి శ్రీరామ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మచిలీపట్నం మండలం జొన్నలవారి మోడీ గ్రామానికి చెందిన అడ్డాల విజయ రామ దుర్గాదేవి ఒక ప్రైవేటు షాపులో టైపిస్టుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ 2024లో వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండగా, ఇటీవల విజయ వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానం శ్రీరామ్‌లో బలపడింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున మరోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీరామ్.. భార్య విజయ గొంతు నులిమి హత్య చేశాడు.
పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఘాతుకం.. లొంగిపోయిన నిందితుడు
ఈ దారుణం జరిగిన ప్రాంతం ఆర్ పేట పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. హత్య అనంతరం నిందితుడు శ్రీరామ్ ఏమాత్రం తడబడకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న ఆర్ పేట సీఐ ఏసుబాబు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలలోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్న అనుమానం కాస్తా పెనుభూతమై నిండు ప్రాణాన్ని బలిగొనడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

