NTV Telugu Site icon

Tamilisai Soundararajan: నేడు యానాంకు తమిళిసై.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

ఉగ్రరూపం దాల్చిన గోదావరి ముంపు ప్రాంతాలను విలయం సృష్టించింది.. అయితే, ఇప్పుడు క్రమంగా వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది.. అయినా, ఇటు భద్రాచలం తోపాటు.. అటు ధవళేశ్వరం దగ్గర కూడా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది.. వరద ప్రభావం మరింత తగ్గితే గానీ.. మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించరు.. ఇక, అప్పటికే తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు బాధితులను పరామర్శించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. ఇవాళ యానాంలో పర్యటించనున్నారు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ హోదాలో ఇవాళ యానాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటన కొనసాగనుంది.. అనంతరం.. భారీ వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. దీని కోసం హైదరాబాద్‌ నుంచి ఉదయం 8.45 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆమె.. రాజమండ్రి నుండి యానాంకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.

Read Also: Rajendra Prasad Birthday Special : నవ్వుల్లో మేటి నటకిరీటి!

మరోవైపు.. గోదావరి వరదలు యానాంను ముంచెత్తాయి.. యానాంలోని చాలా ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో.. ముందస్తు చర్యల్లో భాగంగా.. విద్యాసంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది.. దీంతో.. ఇవాళ కూడా యానాంలోని విద్యాసంస్థలకు మూతపడనున్నాయి.. సోమవారం రోజు కూడా విద్యాసంస్థలు తెరుచుకోలేదు.. నేడు రెండో రోజూ యానాంలో అన్ని విద్యా సంస్థలకు సెలవు.. కాగా, యానాం పట్టణంలో వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ మేరకు యానాం పరిపాలన అధికారి శర్మ ఆదేశాలు జారీ చేశారు.. ఆ ఆదేశాలతో యానాం రీజియన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఈ రోజు మూతపడనున్నాయి.

ఇక, యానాంలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 4,400 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో నాలుగు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పుదుచ్చేరి విపత్తు నిర్వహణ అథారిటీ డిప్యూటీ కలెక్టర్ ఎన్. తమిళసేవన్ ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)కి చెందిన దాదాపు 20 మంది సభ్యులు యానాంలో సహాయక చర్యల కోసం మోహరించారు. కాగా, జిల్లా కలెక్టర్ ఇ.వల్లవన్ సోమవారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రారంభించారు. మంత్రి కె.లక్ష్మీనారాయణ, పీడబ్ల్యూడీ చీఫ్‌ ఇంజనీర్‌ సత్యమూర్తి కూడా యానాం వెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.