ఏపీలో నూతన జిల్లాలపై రచ్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. ఈ సందర్బంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ ను జిల్లాగా సీఎం జగన్ ప్రకటించారని ఆయన అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని చోట్ల పలు ప్రాంతాలను కలిపారని, జిల్లాల పునర్విభజన ప్రక్రియ చాలా అద్భుతంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 11వేల ఆర్బీకే కేంద్రాలు, గ్రామ సచివాలయాలను సీఎం ఏర్పాటు చేశారన్నారు. అధికార వికేెంద్రీకరణ చేస్తోన్న సీఎంగా సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని 2018 పాదయాత్రలో స్థానికులు వైఎస్ జగన్ ను కోరారని, జిల్లాల విభజన అనంతరం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని వైఎస్ జగన్ అప్పుడే హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎంకు పాదాభివందనం చేస్తున్నానని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు వైసీపీ వ్యతిరేకం కాదని, చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలున్నాయని, జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మార్పులు, చేర్పులకు అవకాశాలున్నాయని ఆయన స్పష్టం చేశారు.