చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో గురువారం ఉదయం కేదారేశ్వర గౌరీ వ్రతం ఏకాంతంగా నిర్వహించారు. ఆలయమంతా విద్యుద్దీపాలతో అరటి చెట్లు, మావిడాకులతో సుందరంగా అలంకరించి గౌరీ దేవి అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఎదురుగా కొలువుదీర్చారు. వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో అమ్మవారిని చక్కగా అలంకరించారు.
అనంతరం కలశ స్థాపన పుణ్య వచనము ,వరుణ పూజ, కలశానికి పుష్పాలతో కుంకుమతో పూజ చేసి హారతి సమర్పించారు. ఆపై వేద పండితులు గౌరీ వ్రతం గురించి వివరించారు.దీప ధూప నైవేద్యం అఖండ దీపారాధన కర్పూర హారతి పట్టారు. విశేషంగా మహిళలు నోము నోచుకుని ఒకరికి ఒకరు మహిళలు నోముదారం కట్టుకున్నారు. తదుపరి మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.