Site icon NTV Telugu

Annavaram Temple Prasadam: అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకలు.. ఈవో సీరియస్‌..

Annavaram Temple Prasadam

Annavaram Temple Prasadam

Annavaram Temple Prasadam: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం కి సంబంధించిన ప్రసాద విక్రయ కేంద్రములో ఎలుకలు తిరుగుతున్నాయి… నేషనల్ హైవే మీద ఏర్పాటుచేసిన ప్రసాదం విక్రయ కేంద్రం లో ఈ ఘటన జరిగింది.. అమ్మడానికి ఉంచిన ప్రసాదం బుట్టలలో నుంచి బయటికి వస్తున్నాయి ఎలుకలు.. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భక్తులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ఇదేంటని ప్రసాదం అమ్ముతున్న వారిని ప్రశ్నిస్తే నచ్చితే కొనండి.. లేదంటే లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Road Safety Shields: మీరు మీ ఫ్యామిలీ సేఫ్.. రోడ్లపై మరణాలకు చెక్ పెట్టే 5 సేఫ్టీ షీల్డ్స్!

అయితే, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలోని ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు కనిపించిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై దేవస్థానం ఈవో తీవ్రంగా స్పందించారు. ప్రసాదం ప్యాకింగ్ మరియు విక్రయ కేంద్రంలో పరిశుభ్రత లోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదం బుట్టల్లో ఎలుకలు ఉన్నాయని సమాచారం అందినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ప్రసాదం ప్యాకర్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించేలా ప్రసాద కేంద్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈవో స్పష్టం చేశారు. ప్రసాదం పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా, ప్రసాదం కౌంటర్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ఎలుకలు లోపలికి రాకుండా అవసరమైన సాంకేతిక మార్పులు చేయాలని అధికారులను ఈఓ ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రత చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఈ ఘటన నేపథ్యంలో అన్నవరం దేవస్థానంలో ప్రసాద తయారీ, ప్యాకింగ్, విక్రయ ప్రక్రియలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ప్రసాదం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Exit mobile version