Site icon NTV Telugu

Janasena Pac Meeting: పవన్ యాత్రపై రేపు కీలక నిర్ణయం

Janasena Pac

Janasena Pac

ఒకవైపు రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. జనసేన అధినేత పవన్ పై అధికార పార్టీ నేతలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన పీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ చేపట్టబోయే యాత్రకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై చర్చించనున్నారు. దీంతో పాటు.. తాజాగా జరుగుతున్న పరిణామాలు.. పొత్తులపై జరుగుతున్న ప్రచారం.. డిజిటిల్‌ వింగ్‌ ద్వారా ప్రచారం.. రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన కార్యక్రమాలు.. అలాగే జనవాణి ప్రొగ్రామ్‌కు సంబంధించిన వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ వంటి అంశాలపై చర్చించనుంది జనసేన పీఏసీ.

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన అంచనా వేసుకుంటోంది. దీనికి అనుగుణంగా ఇప్పటి నుంచే గ్రౌండ్‌ సిద్దం చేసుకుంటోంది. దీంట్లో భాగంగా పవన్‌ కళ్యాణ్‌ దసరా పండుగ అక్టోబర్‌ ఐదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరోవైపు ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు త్వర త్వరగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ కీలక తరుణంలో జనసేన పార్టీ కీలక పీఏసీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ చేపట్టబోయే రాష్ట్రవ్యాప్త పర్యటనకు అవసరమైన విధి విధానాల రూపకల్పనపై ప్రధానంగా చర్చించే సూచనలు కన్పిస్తున్నాయి. ఎక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలి.. రూట్‌ మ్యాప్‌ ఏ విధంగా ఉండాలనే అంశంపై జనసేన ఈ పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.

మరోవైపు పొత్తుల గురించి ఏపీ రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. మరోవైపు దమ్ముంటే సింగిల్‌గా ఎన్నికలకు రావాలంటూ అధికార పార్టీ నుంచి సవాళ్లు వస్తున్నాయి. అలాగే టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వీటికి గట్టిగా కౌంటర్లు ఇచ్చేలా వ్యూహాన్ని రచించడంతోపాటు.. పొత్తుల అంశంపై ప్రాథమికంగా చర్చ జరిగే అవకాశం కన్పిస్తోంది. అలాగే పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు.. రూపొందించుకోవాల్సిన ప్రణాళికలు మీద పీఏసీ సమావేశంలో ఫోకస్‌ పెట్టనున్నారు పవన్‌.

ఇక జనసేన ఇటీవల నిర్వహించిన వివిధ కార్యక్రమాలు.. చేపట్టిన ప్రొగ్రామ్స్‌కు సంబంధించిన జరిగిన పురోగతి.. వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై సమీక్ష చేపట్టనున్నారు పవన్‌. రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించింది. అది ఏ రకమైన ఫలితాన్ని ఇచ్చింది..? అలాగే జనవాణికి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఏంటీ..? ఏమైనా సమస్యలు జనవాణి ద్వారా పరిష్కారమయ్యాయా..? లేదా..? అనే అంశంపై చర్చించనున్నారు. అలాగే పోలవరం నిర్వహిసితులు.. వరదలతో అల్లాడుతున్న బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదనే అంశాల పై పీఏసీ సమావేశంలో చర్చించనుంది జనసేన.

Read Also: AIIMS Name Change: ఎయిమ్స్ పేర్లు మార్పు.. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతిపాదన

Exit mobile version