NTV Telugu Site icon

ఉగాదికి కుదరలేదు, అందుకే మే 30న ?

ఉగాది పండుగ పూట జగన్ ప్రకటించాలనుకున్న జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించ లేకపోయింది. దీన్ని వచ్చే నెల 30వ తేదీ నాటికి వాయిదా వేసినట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో సీఎస్ స్థాయిలో కూడా అన్ని రకాల ప్రక్రియలు పూర్తి అయినా.. ఫైనాన్స్ శాఖ నుంచి క్లియరెన్స్ లేకపోవడం వల్ల అనుకున్న సమయానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోయారనే చర్చ జరుగుతోంది.‌ మే నెల 30 నాటికి సీెఎంగా జ‌గ‌న్ పాల‌నా ప‌గ్గాలు చెపట్టి రెండేళ్లు పూర్తి కానుంది.. అదే రోజు ఉద్యోగాల నియామ‌క క్యాలెండ‌ర్ సీఎం జ‌గ‌న్ ప్రకటించే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. 

ఈ క్రమంలో ఏ ఒక్క నియ‌మాకం చేప‌ట్టాల‌న్న ఖ‌జానా పై ఆర్ధిక భారం పడుతుంది.. దీంతో ఆర్ధిక శాఖ కొత్త నియ‌మాకాల‌కు క్లియ‌రెన్స్ ఇవ్వ‌కపోవ‌డం వ‌ల్లే ఉగాది నాడు చేయాల్సిన ప్ర‌క‌ట‌న వాయిదా ప‌డిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ప్ర‌చారం. గ్రామ‌, వార్డు ‌స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేసి.. దానిలో దాదాపు ల‌క్షా 23 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను కేవ‌లం మూడు నెల‌ల కాలంలో నియామకాల‌ను చేప‌ట్టి చ‌రిత్ర సృష్టించారు జ‌గ‌న్. ఇప్పుడు వివిధ శాఖ‌ల్లో ఉన్న ఉద్యోగాల భ‌ర్తీ పై దృష్టి సారించారు. దీని కోసం సిఎస్ ఆదిత్య నాధ్ దాస్ నేతృత్వంలో అధికారులు ప‌లుమార్లు దీనిపై క‌స‌ర‌త్తు చేశారు. మొత్తం ఖాళీలెన్నో.. ఎన్ని భర్తీ చేస్తామనేది త్వ‌ర‌లో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌క‌టించనుంది.

రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా.. గ‌తంలో ప‌ని చేసిన ఆయా ప్ర‌భుత్వాలు అడ‌పాద‌డ‌పా ఎపీపీఎస్సీ ద్వారా నియ‌మాకాలు చేప‌ట్టి చేతులు దులుపుకున్నాయి. దీంతో చాలా పోస్టులు భర్తీ కాకుండా పెండింగులో ఉండిపోయాయి. ఏళ్ల త‌ర‌బ‌డి నియ‌మ‌కాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఉన్న ఖాళీల‌ల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి తాత్కాలికంగా ప‌ని చేయించుకుంటున్నారు. 3.50 ల‌క్ష‌ల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఏపి లో వివిధ విభాగాల‌లో ప‌ని చేస్తున్నారు.

 1970 లో కేంద్రం ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన‌ కాంట్రాక్ట్ లేబ‌ర్ య‌బాలిష‌స్ అండ్ రెగ్యులేష‌న్ యాక్ట్  ప్ర‌కారం శాశ్వత స్వ‌భావం పని ఉన్న‌చోట కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ విధానం లో ఉద్యోగాల నియ‌మకం చేప‌ట్టడం కుదరదు. కానీ చట్టం తెచ్చిన కేంద్రం గానీ.. దానిని అమ‌లు చేయాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వాలు గాని దానికి తూట్లు పొడుస్తున్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లో నియ‌మ‌కాలు చేప‌ట్టి శాశ్వత నియ‌మ‌కాల‌కు ప్ర‌భుత్వాలు తిలోద‌కాలిస్తున్నాయి.  అనేక శాఖ‌ల‌లో.. హెచ్వోడిల‌ల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. సుమారు అన్ని ఖాళీలు క‌లిపి సుమారు 50 వేలకు పైగా పోస్టుల ఉండే అవ‌కాశం ఉంది. ఎన్ని ఖాళీలు ఉన్నా వాటిని భ‌ర్తీ చేయాలంటే ఆర్ధిక శాఖ అనుమ‌తి ఇవ్వాలి. ఉగాదికి ఇవ్వాల్సిన నియ‌మాక క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న ఆగిపోవడానికి ఆర్ధిక శాఖ క్లియ‌రెన్స్ లేక‌పోవ‌డ‌మే అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే నెల 30న ప్ర‌క‌టించే క్యాలెండ‌ర్ ఎన్ని ఉద్యోగాల‌కు క్లియ‌రెన్స్ ఇస్తారో వేచి చూడాలి.