NTV Telugu Site icon

Cm Jagan Mohan Reddy: ధర్మారెడ్డి, చెవిరెడ్డిలను పరామర్శించిన జగన్

jagan consoled

Collage Maker 22 Dec 2022 08.04 Pm (1)

ఎంత బిజీగా వున్నా.. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఎలా ఆదుకోవాలో సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు. నంద్యాల, తిరుపతి జిల్లాల్లో జగన్ ఇవాళ పర్యటించారు. తుమ్మలగుంట, తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు సీఎం వైఎస్‌ జగన్‌. టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్‌ శివ (28) ఆక‌స్మిక మ‌రణం పొంద‌డంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండ‌లం పారుమంచాల గ్రామానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చంద్రమ‌ళిరెడ్డి చిత్రప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ధ‌ర్మారెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి, కుటుంబ స‌భ్యులు, బంధువుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరామ‌ర్శించారు. ఓదార్చి ధైర్యం చెప్పారు.

గుండెపోటుతో చంద్రమౌళి మృతి
చెన్నైలో బీటెక్‌ పూర్తిచేసి ముంబైలో ఫైనాన్స్‌ కన్సల్టెంటుగా ఉద్యోగం చేస్తున్న ధర్మారెడ్డి తనయుడు చంద్రమౌళి ఈనెల 18వ తేదీన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళికి ఎక్మో చికిత్స అందించిన ఫ‌లితం ద‌క్కలేదు. ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. చంద్రమౌళి భౌతికకాయాన్ని ధర్మారెడ్డి స్వగ్రామం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నై నుంచి తరలించారు. ఇవాళ ఉద‌యం చంద్రమౌళి పార్ధివ దేహానికి అంత్యక్రియ‌లు నిర్వహించారు. తీవ్ర విషాదంలో వున్న ధర్మారెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు సీఎం జగన్. సీఎం వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.

జయమ్మకు సీఎం భరోసా
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన పారుమంచాల గ్రామానికి చెందిన మహిళ జయమ్మ, తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్‌ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు సీఎంకి తన కుమారుడి అనారోగ్య సమస్య వివరించింది. అంతేకాక కుమారుడికి అవసరమైన వైద్య సహాయం, పెన్షన్‌ మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన సీఎం నంద్యాల జిల్లా కలెక్టర్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ జయమ్మ కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.