కోనసీమ జిల్లా వాసులకు 15 రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందకపోవడంతో తెగ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ వాసులకు గుడ్ న్యూస్ అందింది. రేపటి నుంచి కోనసీమ జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 24 నుంచి 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే నాలుగు రోజులుగా విడతల వారీగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నారు.
జిల్లాలో 15 మండలాలు ఉండగా.. ప్రస్తుతం అమలాపురం, అల్లవరం ,అంబాజీపేట, అయినవిల్లి వంటి నాలుగు మండలాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా మంగళవారం నుంచి ఇంటర్నెట్ సేవలు యథావిధిగా పనిచేస్తాయని కోనసీమ జిల్లా పోలీసులు వెల్లడించారు.
Palnadu District: మా స్థలంలో లంకె బిందెలున్నాయి.. తవ్వించండి మహాప్రభో
మరోవైపు అమలాపురం అల్లర్ల కేసులో మరో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 129 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. నిందితుల ఒప్పుకోలు, ప్రత్యక్ష సాక్షులు, సీసీ ఫుటేజీలు, గూగుల్ ట్రాక్, టవర్ లొకేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ అరెస్టులు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో 144 సెక్షన్‌తో పాటు సెక్షన్ 30 కొనసాగుతోంది.