Telugu Desam Party: ఎన్టీఆర్ జిల్లా బెజవాడ టీడీపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం నాడు కేశినేని నాని, దేవినేని ఉమ వ్యతిరేక శిబిరాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న తన ఫార్మ్ హౌసులో టీడీపీ నేతల విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్‌లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అటు మైలవరం టీడీపీలో గందరగోళం నెలకొంది. దేవినేని ఉమ, తన ఫొటో లేకుండానే మైలవరంలో ఆత్మీయ సమావేశం పేరుతో బొమ్మసాని సుబ్బారావు టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం టిక్కెట్ స్థానికులకే ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
Read Also: PeddiReddy: విద్యుత్ ప్రమాదాలకు చెక్.. అగ్రదేశాల్లో విధానాలపై అధ్యయనం
కాగా గొల్లపూడిలో బలమైన నేత కాంగ్రెస్ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వైసీపీలో మైలవరం అసెంబ్లీ సీటు ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అనంతరం 2016లో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయనకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అయినా టీడీపీ అధిష్టానం తనకు టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఆదివారం దేవినేని ఉమకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.