Site icon NTV Telugu

Vishaka: చెత్త నుంచి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

Gvmc Wastage Plant

Gvmc Wastage Plant

విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మరో అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తడి చెత్త, పొడి చెత్తల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ అధికారికంగా ప్రారంభం కాకపోయినా ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పాదన మాత్రం కొనసాగుతోంది. ప్రతిరోజూ ఈ ప్రాజెక్టు నుంచి 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం జరుగుతుంది.

కాగా జీవీఎంసీ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో 110 ఎకరాల స్థలాన్ని జిందాల్‌ సంస్థకు కేటాయించారు. 2016 ఫిబ్రవరిలో జీవీఎంసీ జిందాల్‌ సంస్థతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ.350 కోట్లతో ఈ ప్రాజెక్టును జిందాల్‌ సంస్థ నిర్మించింది. ఒప్పందం ప్రకారం ప్రతిరోజు జీవీఎంసీ పరిధిలోని అన్ని జోన్‌ల నుంచి సేకరించిన 950 మెట్రిక్‌ టన్నుల చెత్తను కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు జీవీఎంసీ తరలించాల్సి ఉంటుంది. మరో 250 మెట్రిక్‌ టన్నుల చెత్తను శ్రీకాకుళం, విజయనగరం, నెల్లిమర్ల కార్పొరేషన్‌ల నుంచి తరలిస్తారు. 25 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టును జిందాల్‌ సంస్థ నిర్వహిస్తుంది. కాలపరిమితి ముగిసిన అనంతరం జీవీఎంసీకి అప్పగించనున్నారు.

Exit mobile version