NTV Telugu Site icon

GVL Narasimha Rao: వైసీపీకి విశాఖ కంటే.. భూముల కబ్జా మీదే ప్రేమ ఎక్కువ

Gvl On Ycp

Gvl On Ycp

GVL Narasimha Rao Demands AP Govt To Solve Peoples Problem: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అధికార వైసీపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వైజాగ్ అభివృద్ధికి వైసీపీ చేసిందేమీ లేదని.. దానికి బదులు ఇంకా నెగెటివ్ రోల్ ప్లే చేసిందని వ్యాఖ్యానించారు. వైసీపీకి విశాఖను అభివృద్ధి చేయడం కన్నా.. అక్కడున్న భూముల్ని కబ్జా చేయడం మీదే ఎక్కువ ప్రేమ ఉందని ఆరోపణలు గుప్పించారు. విశాభ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ.. బొత్స సత్యనారాయణ కాల్పనిక వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ అభివృద్ధికి వైసీపీ ఏం చేసిందో, బొత్స జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధాని అంశం బయటకు రాకుండా వైసీపీ రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని చెప్పారు. ఋషికొండ నిర్మాణాలపై ఎందుకు రహస్యం పాటిస్తున్నారని ప్రశ్నించారు. 22(ఏ)భూముల వివాదం కారణంగా వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఋషికొండలో భవంతులు కట్టుకుంటున్న అధికార పార్టీ.. పేదలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దసపల్లా భూములను ఆఘమేఘాల మీద క్లియర్ చెయ్యడం కోసం ప్రభుత్వం ఉత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. దానికి బదులు ముందుగా పేదల ఇబ్బందుల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ వద్ద విజన్ 2030 సమగ్ర ప్రణాళిక ఉందని తెలిపారు.

అంతకుముందు జీవీఎల్ నరసింహారావు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం బ్యాక్‌స్టెప్ వేసిందన్న ప్రచారాల్ని ఖండించారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగానే ఉందని క్లారిటీ ఇచ్చారు. పత్రికలు కొందరి కుయుక్తులకు లోబడి అసత్య కథనాలు ప్రచారం చేయడం సరికాదని, ఈ అంశంలో మీడియా అపోహలు పెంచే విధంగా ప్రచారం చేస్తుండడం బాధాకరమని అన్నారు. రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాఠీతోనే కొత్త రైల్వే జోన్‌పై ప్రకటన చేయిస్తానని అన్నారు. ఇదే సమయంలో.. రైల్వే జోన్ ఏర్పాటుపై పార్లమెంట్‌లో రైల్వే మంత్రి చేసిన ప్రకటనను కూడా ఆయన చదివి వినిపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించిన జీవీఎల్.. రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి చర్చ జరగాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం జగన్, కేసీఆర్ ఎన్నిసార్లు కలిశారని నిలదీశారు. అసలు ఆ ఇద్దరు సమస్యల పరిష్కారం కోసమే కలుస్తున్నారా? లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అని అనుమానం వ్యక్తం చేశారు.