Site icon NTV Telugu

Telugu Mahasabhalu 2026: నేటి నుంచి తెలుగు మహాసభలు..

Telugu Mahasabhalu

Telugu Mahasabhalu

Telugu Mahasabhalu 2026: మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న మహాసభలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చనతో ప్రారంభమయ్యే ఈ వేడుకను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్‌ రవీంద్ర కలిసి ప్రారంభించబోతున్నారు.. ప్రధాన వేదికతో పాటు మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు ఇలా ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.. రాత్రి 11 గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని మహాసభల నిర్వాహకుడు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్ పేర్కొన్నారు..

Read Also: Ravi Teja: ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ

ఇక, మహాసభల్లో ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలు, హోమాలు, కల్యాణాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.. తెలుగు భాష ఔన్నత్యాన్ని ఆధ్యాత్మిక కోణంలో ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనతను ప్రతిబింబించేలా పురాతన సాహిత్య గ్రంథాలు, ప్రాచీన తెలుగు నాణేలు, సంప్రదాయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. శనివారం సాయంత్రం జరిగే ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల ప్రదాన సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.హెచ్‌. మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొనబోతున్నారు.

మహాసభల రెండో రోజు అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రత్యేక సభలకు మారిషస్‌ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్‌ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. ఏపీ హైకోర్టు జడ్జీ జస్టిస్‌ ఎన్‌. జయసూర్య, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు సహా పలువురు మంత్రులు పాల్గొననున్నారు. సాయంత్రం జరిగే కార్యక్రమాలకు త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి హాజరవుతారని చెబుతున్నారు.. మరోవైపు, మహాసభల చివరి రోజైన సోమవారం ఉదయం జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, పలువురు మంత్రులు హాజరుకానున్నారు.. ఇక, నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణానికి డాక్టర్ ఘంటసాల మరియు డాక్టర్‌ ఎస్పీ బాలు వేదికగా నామకరణం చచేశారు..

Exit mobile version