Site icon NTV Telugu

Speaker Ayyanna Patrudu: తెలుగు భాష కాదు.. మన సంస్కృతి.. జీవన విధానం… మన ఆచారం..

Ayyanna Patrudu

Ayyanna Patrudu

Speaker Ayyanna Patrudu: తెలుగు భాష కాదు.. మన సంస్కృతి.. మన జీవన విధానం… మన ఆచారం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. గుంటూరులో జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు భాష ప్రాధాన్యంపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు.. అది మన సంస్కృతి, మన జీవన విధానం, మన ఆచారం అని స్పష్టం చేశారు. అయితే, నేటి తరం పిల్లలకు తెలుగు భాషతో పాటు మన సంప్రదాయాలు, ఆచారాలు కూడా తెలియకపోవడం బాధాకరమని అయ్యన్నపాత్రుడు అన్నారు. మన భాష, మన సంస్కృతి గురించి ఈనాటి పిల్లలకు అవగాహన లేదు. అందుకే పిల్లలకు తెలుగు గొప్పదనాన్ని మనమే చెప్పాలి అని సూచించారు.

Read Also: Iran: ఇరాన్‌లో తీవ్రమవుతున్న నిరసనలు.. భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు

తెలుగు మన జీవితంలో ఎంతగా పాతుకుపోయిందో వివరించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. తల్లి గొంతు నుంచి వచ్చే ఆ తొలి పాటే తెలుగుతో మొదలవుతుంది. అది మన భాషలోని మాధుర్యానికి గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.. గతంలో తల్లిదండ్రులు “చందమామ రావే, జాబిల్లి రావే” అంటూ పిల్లలకు అన్నం తినిపించేవారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు సెల్‌ఫోన్ చేతిలో పెట్టి పిల్లలకు అన్నం పెడుతున్నారు. ఇది మారాలి. టెక్నాలజీ అవసరమే.. కానీ సంస్కృతిని మర్చిపోవద్దు అని హితవు పలికారు.

తెలుగు భాష మన పండగల్లో, పూజల్లో, ఆచారాల్లోనూ ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. దసరా, సంక్రాంతి, శ్రీరామనవమి, ఉగాది వస్తే పల్లెలు కళకళలాడేవి. ప్రతి పండగలో తెలుగు పాట, తెలుగు పలకరింపు, తెలుగు సంప్రదాయం ఉండేవి. కానీ, ఈరోజు మనం ఉగాది (తెలుగు సంవత్సరాది)ని కూడా పట్టించుకోవడం లేదు. ఇది మన సంస్కృతి పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి లాంటి తెలుగు భాషను అందరూ గౌరవించాలి. దాన్ని చిన్నచూపు చూడకూడదు. మన జీవన విధానం, మన ఆచారం, మన సంస్కృతి.. అన్నీ తెలుగే అని మరోసారి స్పష్టం చేశారు.. ఇకపై ఇంట్లో, బడిలో, సమాజంలో పిల్లలకు తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి చెప్పాలని పిలుపునిచ్చారు. భాషను బతికించుకుంటేనే సంస్కృతి బతుకుతుంది.. సంస్కృతి బతికితేనే మన గుర్తింపు నిలబడుతుంది అని పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు..

Exit mobile version