NTV Telugu Site icon

Green Field Farmers Protest: ఏలూరు కలెక్టరేట్ ముందు గ్రీన్ ఫీల్డ్ నిర్వాసిత రైతుల ఆందోళన

Green Field

Green Field

ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు కదం తొక్కారు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు. మాభూమి-మా హక్కు అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఛలో కలెక్టరేట్ -మహాధర్నా నిర్వహించారు. ఆర్బిట్రేషన్ల ద్వారా ఎకరాకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని, సర్వీస్ రోడ్లు బిటి రోడ్లుగా నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ పరిహారం మంజూరులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణం న్యాయం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తాం అని గ్రీన్ ఫీల్డ్ నిర్వాసిత రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.

Read Also: Dussehra : పండుగకు ఊరెళుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నుండి ఫైర్ స్టేషన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. చింతలపూడి,టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం,దేవరపల్లి, గోపాలపురం మండలాలు నుండి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నర్సింహా మాట్లాడారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే వలన రైతుల పచ్చటి పంట పొలాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో తక్కువ పరిహారం ఇచ్చి అన్యాయం చేశారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్బిట్రేషన్ల విచారణ తక్షణమే పూర్తి చేసి పరిహారం పెంచుతూ వెంటనే జడ్జిమెంట్ ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ. 50 లక్షలు పరిహారం అందించాలన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పునరావాసం, పునర్నిర్మాణం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.

బోర్లు కోల్పోయిన రైతులకు ఉచితంగా బోర్లు వేయాలని, చెట్లు,షెడ్లు, బోర్లకు తగిన పరిహారం అందించాలన్నారు. గ్రీన్ ఫీల్డ్ భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఏపీ రైతు సంఘం నేతలు కృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు మార్ని శ్రీనివాస్, ముళ్ళపూడి అశోక్, ఆచంట గోపాలకృష్ణ, కొడవటి రామకృష్ణ, జమ్ముల ఉదయభాస్కర్, కొట్టు కనక నరసింహారావు, వందనపు సాయిబాబా, గోలి నరసింహారెడ్డి, వడ్లపూడి శ్రీనివాసరావు, వెదుళ్ళ నాగేశ్వరరావు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read Also: RRR: జపాన్ లో జయకేతనం ఎగరేయబోతున్న రామ్ అండ్ భీమ్!