Krishna Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నది శాంతించింది. దీంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11 అడుగులకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 9.7 లక్షలు, కాలువలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా కోనసీమ, గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముంపు తొలగిన ప్రాంతాలు, నివాసాల్లో బురద పేరుకుపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.
Read Also: Gold Theft: పెళ్ళికి వెళ్లారు.. వచ్చేలోగా బంగారం మాయం
మరోవైపు కృష్ణా నది ఉరుకులు, పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కింద శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి విడుదలైన నీరు నెమ్మదిగా సాగర్‌కు చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 35,968 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 89,198 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 881.70 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగాప్రస్తుత నీటి నిల్వ 197.4617 టీఎంసీలుగా ఉంది. అటు కృష్ణా బేసిన్‌లోని పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 12,759 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 10,400 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 40.07 టీఎంసీలుగా ఉంది. విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండటంతో 70 గేట్లను ఎత్తి సుమారు 70వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.