ఏపీలో 3 రాజధానులు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిననాటి నుంచి అమరావతి రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఏపీని అభివృద్ధి చేసేందుకే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతుంటే.. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరితో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయటం లేదంటూ టీడీపీతో పాటు వివిధ పార్టీల నేతలు అంటున్నారు. అంతేకాకుండా రాజధాని అమరావతి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులు తమ త్యాగం వృధా అయిందని ఆవేదన చేస్తున్నారు.
అమరావతిని అభివృద్ధి చేయాలని కోరుతూ తుళ్ళూరు నుండి తిరుమల వరకు రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. నేటి నుండి న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభించనున్నారు. 450 కిలోమీటర్లు 45 రోజులు పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. రైతుల పాదయాత్ర కు పలు రాజకీయ పార్టీలు,నేతలు సంఘీభావం ప్రకటించారు.