NTV Telugu Site icon

ఏపీలో నకిలీ చలాన్ల స్కాం కలకలం

నకిలీ చలాన్లతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఘటనలు కలకలం సృష్టించాయి. కడప సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసిన తర్వాత రాష్ట్రంలో అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018నుంచి ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన చేపట్టారు. గుంటూరు జిల్లాలో 35 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శ్రీనివాసరావు ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు. 2020 జనవరి నుంచి అప్ లోడ్ చేసిన చలాన్ల తనిఖీల్లో మోసాలు బయటపడ్డాయి. 2021 జనవరి నుంచి నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు.


దాదాపు ఎనిమిది మంది పూర్తిస్థాయిలో స్టాంప్ డ్యూటీ కట్టినట్లు చలాన్లు సమర్పించినా ప్రభుత్వ ఖజానాకు మాత్రం జమకాలేదు. దీంతో నకిలీ చలాన్ల ద్వారా మోసం చేసినట్లు అధికారులు తేల్చారు. మరికొన్ని డాక్యుమెంట్లలో చలాన్ల రూపంలో స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు చూపించినా సీఎంఎఫ్ఎస్ లో మాత్రం ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దాదాపు 8మంది ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో ఆస్థులు కొనుగోలు చేసి స్టాంప్ డ్యూటీ చెల్లించని వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సబ్ రిజిష్ట్రార్ ఫిర్యాదుతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ చలాన్లతో ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి వివరాలను కూడా అందించారు.

ఫిర్యాదులో ఎవరెవరు ఎలా మోసం చేశారో, ఎంత మొత్తం మోసం చేశారో కూడా వివరించారు. దీంతో నకిలీ చలాన్ల మోసంపై విచారణ ప్రారంభించారు పోలీసులు. నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన ఘటనల్లో కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఉందని, వారికి కొంతమంది సిబ్బంది కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ చలాన్ల కేసులో… కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. వీరు చలాన్లలో భారీ అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో నిర్ధారించారు. మరికొందరు స్టాంప్ రైటర్లపై అధికారులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.