NTV Telugu Site icon

Ex DGP Sambasiva Rao: ఏపీలో కొత్త రాజకీయాలకు నాంది

ఏపీలో అసలేం జరుగుతోంది? గత కొంతకాలంగా కాపు నేతలు భేటీల మీద భేటీలు కావడం వెనుక ఆంతర్యం అదేనా? రాజకీయంగా వత్తిడి పెంచేందుకు ఒక వేదిక అవసరం అని భావిస్తున్నారా? తాజాగా విశాఖలో జరిగిన కాపు నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థ ఆవిర్భావం జరిగిందని మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు ప్రకటించారు.

ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. బహుజన కాపు సామాజిక వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వాతంత్రం కోసం ఫోరం ఫర్ బెటర్ ఏపీ పనిచేయబోతోంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుగా పనిచేస్తుందన్నారు సాంబశివరావు. భవిష్యత్ లో రాజకీయ అజెండా తీసుకునే అవకాశం ఉందని, ఉత్తరాదిలో సామాజిక వర్గాల మధ్య జరిగిన కూర్పు లాంటి ప్రయోగంగా దీన్ని భావించవచ్చు అన్నారు.

రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా పర్యటనలు చేస్తామన్నారు. కాపు రిజర్వేషన్లు కంటే ఆర్ధిక,సామాజిక,రాజకీయ ఎదుగుదలే కీలకం అన్నారు సాంబశివరావు. బహుజన,కాపు, అగ్రవర్ణ పేదల కలయికతో కొత్త సమీకరణలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు కావాల్సిన అంత చోటు ఉందని కాపునేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం వున్నందున ఫోరం ఫర్ బెటర్ ఏపీ తన కార్యాచరణను ప్రకటించే అవకాశం వుంది. మొత్తం మీద కాపునేతల సమీకరణలు రాష్ట్ర రాజకీయాలను ఎలా మారుస్తాయో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.