Site icon NTV Telugu

Polavaram Project: పోలవరంలో విదేశీ నిపుణుల బృందం.. ప్రాజెక్టుపై రానున్న స్పష్టత..

Polavaram Project

Polavaram Project

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన నాలుగో రోజు కొనసాగనుంది. గడిచిన మూడు రోజుల్లో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన బృందం కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణంపై ఒక క్లారిటీ కి వచ్చింది. 2026 నాటికి వాల్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదే సమయంలో ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఏరకంగా మొదలుపెట్టాలి అనే విషయంపై నాలుగో రోజు అధికారులతో చర్చించనున్నారు.

Read Also: Lady Aghori Naga Sadhu: వేషం మార్చిన అఘోరీ.. మహానంది క్షేత్రంలో ప్రత్యక్షం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసే పనిలో భాగంగా విదేశీ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో బృందం చర్చించింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయా ఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేయబోతున్నారు. నిన్నటి వరకు జరిగిన చర్చల్లో ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు చేపట్టాలన్న జల వనరుల శాఖ ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది. శనివారం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది. డయాఫ్రం వాల్‌ డిజైన్లు, నిర్మాణ వ్యవధిపై జరిగిన చర్చలో 2026 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పాటు.. వాల్‌ ఎత్తును 19 మీటర్ల వరకు పెంచాలని నిర్ణయించారు. కాఫర్‌ డ్యాంల నుంచి సీపేజీని అరికట్టడంపై కూడా చర్చించారు. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీని అరికట్టేందుకు 7,840 హెచ్‌పీ మోటార్లను వాడాల్సి ఉంటే.. ప్రస్తుతం 3,750 హెచ్‌పీ మోటార్లతో డీవాటరింగ్‌ చేపడుతున్నారు. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని.. అప్పుడు వాల్‌ నిర్మాణానికి ఆటంకాలు ఎదురుకావని నిపుణులు సూచించారు. శనివారం జరగనున్న సమావేశంతో మరిన్ని అంశాలపై పూర్తి క్లారిటీ రానుంది.

Exit mobile version