Site icon NTV Telugu

Pawan Kalyan: విభజన తర్వాత పదేళ్లు నలిగిపోయాం.. తెలుగు జాతి కోసం కూటమిగా ఏకమయ్యాం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర నష్టాలను ఎదుర్కొందని, మళ్లీ రాష్ట్రం నష్టపోకుండా ఉండేందుకే తెలుగు జాతి ప్రయోజనాల కోసం కూటమిగా ఏకమయ్యామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన జలజీవన్ వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేసిన పవన్‌ కల్యాణ్‌.. ఈ పథకానికి “అమరజీవి జలధార” అని నామకరణం చేసినట్లు ప్రకటించారు. ఐదు జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లో నివసించే సుమారు 67.82 లక్షల మందికి ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యమని తెలిపారు. రెండు సంవత్సరాల్లో ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Smoking Violation: విమానంలో సిగరెట్ తాగుతూ పట్టుబడ్డ పాకిస్తాన్ హాకీ జట్టు మేనేజర్.. దింపేసిన సిబ్బంది..

రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును కేవలం నెల్లూరు జిల్లాకు పరిమితం చేశారని విమర్శించిన పవన్‌.. ఒక జిల్లాకు మాత్రమే పేరు పెట్టడం ద్వారా అమరజీవి స్థాయిని తగ్గించినట్టయిందన్నారు. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఈ జలధార పథకానికి అమరజీవి పేరు పెట్టామని తెలిపారు. ఇక, తాను పాల్గొనే సభలకు ప్రధాని నరేంద్ర మోడీ రావడానికి భయపడుతున్నారంటూ పవన్‌ వ్యాఖ్యానించారు. అయితే అభిమానులు వేదికపైకి నెట్టుకుంటూ రావడం తనకు ఇష్టం లేదని, ప్రజల మధ్యనే ఉండాలని కోరుకుంటానన్నారు. పిల్లలకు చిన్న వయసులోనే కులాలను ఆపాదించడం ప్రతిపక్షాల క్షేమహారమని విమర్శించారు.

అధికారంలో ఉన్నా లేకపోయినా బెదిరింపులకు పాల్పడే ప్రతిపక్షాలను సహించబోమని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ఇతర దేశాల్లో కూర్చుని సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా ఆంధ్రప్రదేశ్‌ తరఫున గట్టిగా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో లంచాలు తీసుకుని వ్యవస్థలను పాడు చేశారని ఆరోపించిన పవన్‌.. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మూడు పార్టీలు ఏ లక్ష్యంతో కలిశాయో, అందుకు నిదర్శనమే అమరజీవి జలధార పథకం అని చెప్పారు. ఈ ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఎవరినీ వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Exit mobile version