ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మద్యం మత్తులో ఓ మహిళ హంగామా సృష్టించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుల్లలచెరువు రోడ్డుపై మద్యం సేవించిన ఆమె, “క్వార్టర్ మందు కావాలి” అంటూ ఆర్టీసీ బస్సును అడ్డగించి రోడ్డుపై కూర్చుంది. క్వార్టర్ మందు ఇప్పించకపోతే బస్సును ముందుకు కదలనివ్వనని మొండికేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ బస్సు ముందు కూర్చుని అరుస్తూ, హల్‌చల్ చేయడంతో దాదాపు అరగంట పాటు బస్సు అక్కడే నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు కూడా భయాందోళనకు లోనయ్యారు.
ఈ పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, చివరకు స్థానికుల సహాయంతో మహిళను రోడ్డుపక్కకు తొలగించి బస్సును ముందుకు నడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మహిళ ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం దీనిపై ఫన్నీ కామెంట్లు చేస్తూ స్పందిస్తున్నారు.
