Site icon NTV Telugu

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కె. కన్నబాబు

ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉత్తారంధ్రలో భారీనుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్‌ కె. కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని, దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందన్నారు. శనివారం ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయన్నారు.

రేపు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఎల్లుండి ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మత్స్యకారులు ఎవ్వరూ సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాల వద్ద ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని పనులు చేసుకోవాలని ఆయన సూచించారు.

Exit mobile version