NTV Telugu Site icon

శారదా పీఠంలో సీపీఐ నేత నారాయణ.. విషయం ఇదే..!

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏం చేసినా సంచలంగా మారుతుంది.. సంచలన వ్యాఖ్యలే కాదు.. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు వైరల్‌గా మారిపోతుంటాయి.. తాజాగా… విశాఖలోని శారదా పీఠంలో ప్రత్యక్షమయ్యారు నారాయణ.. అక్కడ స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.. అదేంటి కరుడుగట్టిన కమ్యూనిస్టు నారాయణ.. శారదాపీఠం వెళ్లడమేంటి..? అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి..? అనే అనుమానం వెంటనే కలగొచ్చు.. విషయం ఏంటంటే.. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.. జీవీఎంసీలో ఆయన సీపీఐ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు.

97వ వార్డు అభ్యర్తి యశోద తరపున చిన మూషిడివాడలో ప్రచారం చేసిన ఆయన.. అక్కడే ఉన్న విశాఖ శారదా పీఠాన్ని కూడా సందర్శించారు.. తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించిన నారాయణ.. పనిలో పనిగా స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. కాగా, శారదా పీఠంలో నారాయణ ప్రత్యక్షం కావడంలో పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికరంగా మారింది. అయితే, ఇలాంటి విషయాలకు నారాయణ మినహాయింపుగానే చెప్పవచ్చు.. గాంధీ జయంతి రోజు చికెన్ తిని.. ఏడాది పాటు చికెన్ తినడం మానేసినా ఆయనకే చెల్లగా.. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు.. అదేంటి అని ప్రశ్నిస్తే.. చాలాసార్లు తిరుమలకు వచ్చా.. కానీ, శ్రీవారిని దర్శించుకోలేదు.. కానీ, కుటుంబసభ్యులు బలవంతం చేయడంతో ఈసారి తప్పలేదని సమాధానం ఇచ్చారు.