NTV Telugu Site icon

దేవుళ్ళకు కూడా కరోనా ఎఫెక్ట్ !

కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ఆలయాలను మూసేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ప్రధాన ఆలయాల్లో దర్శనాలు నిలిపివేశారు .  తాజాగా చిన్న చిన్న గుడులకు సైతం తాళం  వేస్తున్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్‌  ఇంద్రప్రస్తా కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయాన్ని మూసివేశారు. గుడి బయట నుంచే  దండం పెట్టుకొని వెళ్లిపోతున్నారు  భక్తులు. ఇక శ్రీరామనవమి వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత కొనసాగుతోంది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆలయాలపై కరోనా ఎఫెక్ట్‌. పురాతన ఆలయాలన్నీ మూసివేయాలని కేంద్ర ఆర్కెలాజికల్‌ అధికారులు ఆదేశించారు. దీంతో బుగ్గ రామలింగేశ్వర ఆలయం, చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు … దేవాలయాలు మూసే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి భక్తుడు కోవిడ్‌ నిబంధనలు పాటించి… ఇంటి దగ్గర పూజలు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కరోనా విజృంభిస్తున్నందున  అనంతపురం జిల్లా లేపాక్షి లో ప్రసిద్ధి  పుణ్య క్షేత్రం  శ్రీ దుర్గా   పాపనాశేశ్వర వీరభద్ర స్వామి దేవాలయాన్ని  ఈరోజు ఉదయం నుంచి మూసివేశారు.  వచ్చే భక్తులకు దర్శనం కూడా నిలిపివేశారు  దేవాలయంలోకి ప్రవేశించకుండా  బారికేడ్లను ఏర్పాటు చేశారు. లేపాక్షి ప్రధాన ఆలయం తో పాటు నంది విగ్రహం కూడా  అధికారులు  మూసివేశారు. గర్భగుడిలో పూజలు  కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది