NTV Telugu Site icon

CM Jagan: ఎటువంటి గ్యారంటీ లేకుండా సున్నా వడ్డీతో రుణాలిస్తున్నాం

Cm Jagan

Cm Jagan

CM Jagan: ఏపీలో చిరువ్యాపారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో ఈరోజు రుణాలను అందించారు. ఈ మేరకు సీఎం జగన్ బటన్ నొక్కి ఒక్కో చిరు వ్యాపారి బ్యాంకు ఖాతాలో రూ.10వేలు వడ్డీ లేని రుణాన్ని జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిరు వ్యాపారుల కష్టాలను దగ్గరి నుంచి చూసి, వారి కష్టాలను తీర్చేందుకే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. చిరు వ్యాపారులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వడ్డీ, గ్యారంటీ లేకుండా రూ.10 వేల రుణం అందిస్తున్నామని తెలిపారు. జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వివరించారు.

Read Also: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్ ఖర్చు ఎంత?

కాగా ఈ రుణాలకు సంబంధించి చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని, ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటి వరకు 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు సీఎం జగన్ వివరించారు. గత 6 నెలల వ్యవధిలో ఈ పథకం కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి వడ్డీ రూ.15.17 కోట్లను రీయింబర్స్‌మెంట్ చేశామన్నారు. ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఈ పథకానికి సంబంధించి రుణాలను సకాలంలో చెల్లించిన 13.28 లక్షల మందికి రూ. 63 కోట్లకు పైగా వడ్డీ తిరిగి చెల్లించామన్నారు. చిరువ్యాపారులు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని జగన్ మెచ్చుకున్నారు. జగనన్న తోడు పథకం అందని చిరు వ్యాపారులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాగా ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.