Site icon NTV Telugu

ఏపీ సీఎం జగన్ ఒడిశా టూర్ సక్సెస్ అయిందా..?

ఏపీ సీఎం జగన్ ఒడిస్సా టూర్ సక్సెస్ అయిందా..? ఆ రాష్ట్ర సీఎంతో ఏపీ ముఖ్యమంత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయా..? ఎన్నో దశాబ్ధాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఓ కొలిక్కివచ్చినట్టేనా..? అసలు ఏపీ సీఎం జగన్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ల మధ్య ఏ విషయాలు చర్చకువచ్చాయి..?
ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సమావేశం సుదీర్ఘంగా సాగింది.

ఒడిషా సచివాలయంలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రధానంగా మూడు అంశాలు చర్చకు వచ్చాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేయాలని అంగీకారానికి వచ్చారు. ముఖ్యంగా ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో సానుకూలంగా చర్చ జరిగింది. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు.

వీటితో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల సమస్య, బహుదానది నీటి విడుదల, కోఠియా గ్రామాల గురించి మాట్లాడుకున్నారు. అంతేకాదు ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్‌వోసీ, యూనివర్శిటీల్లో ఒడిషా, తెలుగు భాషాభివృద్ధికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, గంజాయి సాగు, రవాణా నివారణపైనా సహకారం కొనసాగించడంతో పాటు కలిసికట్టుగా ఎదుర్కోవాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. సరిహద్దు జిల్లాల్లో ఒడిశాలో తెలుగు, ఆంధ్రలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్‌ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షల నిర్వహణకు స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు శ్రీకాకుళంజిల్లాలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు రాష్ట్రాల విశాల ప్రయోజానాల ధ్యేయంగా సమావేశం సాగిందని సీఎం జగన్ .. ట్వీట్ చేశారు. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని విశ్వసిస్తున్నానన్నారు.

Exit mobile version