రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో వివిధ అభివృద్ధిపనులు చేపడుతున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. అంతకుముందు కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన అమీన్ పీర్ దర్గా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దర్గా ప్రతినిధులు దర్గా సంప్రదాయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ దర్గాను సందర్శించడం తన అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం వైయస్ జగన్ కడప అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి.. ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్ సమర్పించారు.
Read Also: New Year 2023: ఫ్యూచర్ యూనికార్న్‌లకు న్యూఇయర్ 2023 కలిసొస్తుందని అంచనా
అమీన్ పీర్ దర్గా సేవలో నిరంతరం అంకితమవుతున్న దర్గా ముజావర్లు, దర్గా కమిటీ సభ్యులను, చౌదరీ కలీఫాలను.. దర్గా పీఠాధిపతులు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతులచే “సూఫీ సర్మాస్త్ సానీ షిలాక్” సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి తలపాగా (పేటా) అలంకరణ చేసి, మెడలో షేలా (కండువా), ఇలాచి (దండ) ధరింపజేశారు. దర్గా పీఠాధిపతులతో కలిసి సీఎం అమీన్ పీర్ దర్గా గుమ్మం ముందుకు చేరుకుని నారికేళీ రాతిపై కొబ్బరికాయ కొట్టి సమర్పించుకున్నారు. అమీన్ పీర్ దర్గా గ్రంథాలయం చేరుకున్న ముఖ్యమంత్రికి పీఠాధిపతుల వారు దర్గా విశిష్టత, చారిత్రక వైభవాన్ని వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్గా ఖ్యాతీ, మహిమలు, ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తున్నాయంటే.. కులమత తేడాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా భాగస్వామ్యం కావడమే ప్రధాన కారణమన్నారు. తాను పుట్టిన సొంత జిల్లాలో ఇలాంటి మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేస్తూ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా మైనారిటీ ప్రజల సేవలో తరిస్తున్న అంజాద్ బాషాకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కడప నగర పాలక కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.
Read Also: New Year 2023: ఫ్యూచర్ యూనికార్న్‌లకు న్యూఇయర్ 2023 కలిసొస్తుందని అంచనా