Site icon NTV Telugu

CJI NV Ramana: విభజన వల్ల ఏపీ నష్టపోయింది.. ఏపీని ఆదుకోవాలి

Nv Ramana

Nv Ramana

CJI NV Ramana: విజయవాడలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. సిటి సివిల్ కోర్టు ఆవరణలో 3.70 ఎకరాల విస్తీర్ణంలో రూ. 92.60కోట్ల వ్యయంతో 8 అంతస్తులతో సిటి కోర్టు కాంప్లెక్స్‌ కోసం భారీ భవనాన్ని నిర్మించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, సీఎం జగన్, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2013 మే 13న హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ చేతుల మీదుగా కోర్టు కాంప్లెక్స్‌ను ప్రారంభించడం గమనించదగ్గ విషయం.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఈరోజు ఉన్నతస్థాయిలో ఇక్కడి కోర్టు భవనాన్ని ప్రారంభించడం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. 2013లో జస్టిస్‌ ఎన్వీ రమణ చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగిందని.. మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషమన్నారు. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టమని.. జ్యూడీషియరీకి సంబంధించి ప్రతి విషయంలోఏపీ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందన్నారు. మరోవైపు సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. సీఎం తెలుగులో మాట్లాడిన తర్వాత తాను మాట్లాడకపోతే బాగోదని.. ఇది మంచి పరిణామం అని ప్రశంసించారు. మిగిలిన వ్యక్తులు ఆంగ్లంలో మాట్లాడితే.. తాను, ముఖ్యమంత్రి మాత్రమే తెలుగులో మాట్లాడటం ఓ ప్రాధాన్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు విభజనతో ఏపీ నష్టపోయిందని.. ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని.. న్యాయవ్యవస్థను బలోపేతం చేసే పనుల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం కూడా చాలా అవసరమని చెప్పారు.

Read Also: Buddha Venkanna: 420 పార్టీలో విజయసాయి, కొడాలి 840లు..!

అటు పదేళ్ల తర్వాత తాను శంకుస్థాపన చేసిన కోర్టు భవనాలను ప్రారంభించడం గొప్ప విషయంగా భావిస్తున్నానని ఎన్వీ రమణ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక సమస్యలు వెంటాడటంతో భవనాల నిర్మాణం కాస్త ఆలస్యం అయ్యిందన్నారు. న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుంచి వ్యతిరేక వచ్చినప్పుడు.. కొందరు సీఎంలు మద్దతు ఇచ్చారన్నారు. వారిలో ఏపీ సీఎం జగన్ కూడా ఉన్నారన్నారు. పెండింగ్‌ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలన్నారు. తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో జడ్జిల ఖాళీలను భర్తీ చేసానని తెలిపారు. తాను 250 మంది హైకోర్టు జడ్జిలను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించగలిగానని.. రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఇప్పుడు ఈ భవనం పూర్తి చేసుకోగలిగామన్నారు. విశాఖలో కూడా ఓ భవనం చివరి దశలో ఉందని.. దాంతో పాటు ఇతర కోర్టు భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నానని ఎన్వీ రమణ పేర్కొన్నారు.

Exit mobile version