తిరుపతి నగర వాసులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త అందించారు. తిరుపతికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టిన శ్రీనివాస సేతు (గరుడ వారధి)ని నవంబరులో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గిరీష్, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి రంగ స్వామి ఇతర అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు.
Read Also: తెలుగుకి ఇప్పుడు కాదు.. ఎప్పుడో అన్యాయం జరిగింది: లక్ష్మీ పార్వతి
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నుంచి కపిలతీర్థం వరకు వంతెన నిర్మాణ దాదాపుగా పూర్తయిందన్నారు. టీటీడీ నుంచి కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సిన మొత్తం త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన పనులు నవంబర్ లోపు పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శ్రీనివాస సేతు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారన్నారు. నవంబరులోగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిలతీర్థం వరకు నిర్మాణం పూర్తి అయిన వారధిని సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించామన్నారు.
