పదో తరగతి ప్రశ్నాపత్రల లీకేజ్ వివాదంలో అరెస్టైన మాజీ మంత్రి నారాయణ, బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే! ఈ బెయిల్‌పై తమ పోలీస్ శాఖ ఉన్నత న్యాయస్థానానికి అప్పీలుకు వెళ్ళనుందని చిత్తూరు ఎస్పీ కార్యాలయం ప్రకటన చేసింది. పదవ తరగతి ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ విషయంలో లోతైన దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమ విచారణను మరింత వేగవంతం చేశామని ఆ ప్రకటనలో పేర్కొంది.
నారాయణ లాంటి విద్యాసంస్థలు.. విద్యా ప్రమాణాల్ని పక్కనపెట్టి, కేవలం ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవడం కోసం అనైతిక కార్యక్రమానికి పాల్పడిందని ఎస్పీ కార్యాలయం చెప్పింది. ప్రధాన ముద్దాయి గిరిధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం, లభించిన సాక్షాలు ఆధారంగానే.. వ్యవస్థీకృత నేరానికి పాల్పడిన నారాయణను అరెస్ట్ చేశామని మరోసారి స్పష్టత ఇచ్చింది. అయితే ఆయనకు బెయిల్ లభించిందని, దీనిపై తాము ఉన్నత న్యాయస్థానానికి అప్పీలుకు వెళ్ళనున్నామని పేర్కొంది.
ఇదిలావుండగా.. పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీసు కేసులో నారాయణ విద్యాసంస్థల్లో డీన్‌గా పనిచేస్తున్న గంగాధరరావు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ8గా ఆయన్ను.. న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కోర్టు ఆయన్ను జుడిషియల్ రిమాండ్‌కు తరలించింది.