పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెనుక నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ ఉన్నట్టు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. ఈ కేసుకి సంబంధించి కొన్ని కీలక వివరాల్ని వెల్లడించారు. గత నెల 27వ తేదీన పేపర్ వాట్సప్‌లో లీకైనట్టు కంప్లైంట్ వచ్చిందని, డీఈవో ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేసి విచారించామని, నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే నారాయణను అరెస్ట్ చేశామన్నారు.
అడ్మిషన్స్ పెంచుకోవడం కోసమే, ఉద్దేశపూర్వకంగా పేపర్స్‌ని లీక్ చేశారని ఎస్పీ తెలిపారు. ఇన్విజిలేటర్స్‌ని మేనేజ్ చేసి.. ఈ లీకేజీలకు పాల్పడ్డారన్నారు. ఇన్విజిలేటర్స్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ ఫోటోలు తీసి బయటకు పంపారన్నారు. వాటికి సమాధానాలు రాసి, మళ్ళీ లోపలికి పంపించారని తెలిపారు. ఎక్కువ మార్కుల కోసమే ఇలా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఎవరైతే ఈ లీకేజ్ వ్యవహారానికి పాల్పడ్డారో, వాళ్లకు డబ్బులు పంపించడానికి ప్రత్యేకంగా రీసోర్సెస్ ఉన్నారన్న విషయం తమకు తెలిపిందన్నారు. పట్టుబడిన నిందితులంతా నారాయణలో పని చేస్తున్నవారేనని క్లారిటీ ఇచ్చారు.
ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్ చేశామని, ఆయన భార్యని అదుపులోకి తీసుకోలేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసుకి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని వెల్లడించారు. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నారాయణపై కేసు నమోదైందని, ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. పూర్తి విచారణ ముగిసిన తర్వాత మిగిలిన వివరాల్ని వెల్లడిస్తామని ఎస్పీ రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు.